
అఖిలా.. చౌకబారు విమర్శలు మానుకో!
ఆళ్లగడ్డ: ‘ఎమ్మెల్యేగా ఉంటూ చౌకబారు విమర్శలు చేయడం సరికాదు.. నోటికి వచ్చింది మాట్లాడటం ఎంత వరకు సమంజసం. హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకో’ అంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి హితువు పలికారు. అహోబిలం క్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో అహోబిలం టోల్‌గేట్ వేలంపాటల్లో తాను రూ. 25 లక్షలు డిమాండ్ చేశా నని అఖిలప్రియ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏదైనా రుజువులు ఉంటే చూపించాలన్నారు. రూ. 20 లక్షలు పాటపాడిన దానికి రూ. 25 లక్షలు తాను వాటా ఇవ్వాలని అడిగానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘ఇదే గేట్ వసూలుకు ఇప్పుడే రూ. 45 లక్షలు కట్టిస్తా.. అధికారులతో వేలంపాట రద్దు చేయించే సత్తా ఉందా’ అని సవాల్ విసిరారు. గతంలో రూ. 45 లక్షలు పాడిన సమయంలో రూ. 100 నుంచి రూ.150 వసూలు చేస్తే ఇప్పుడు రూ. 20 లక్షలకు పాట దక్కించుకున్న వారితో అంతకంటే తగ్గించి వసూలు చేయాలి కదా.. అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో బీ ట్యాక్స్‌కు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నా యన్నారు. అధికార పార్టీ నేతలు కేజీకి అదనంగా ఇవ్వాలని బెదిరిస్తున్నారని చాగలమర్రి చికెన్ సెంటర్ నిర్వాహకులు ఎస్పీకి ఫిర్యాదు చేయలేదా అంటూ గుర్తు చేశారు. అఖిలప్రియ డబ్బులకు పదవు లు అమ్ముకుంటుందోని ఆమె సొంత బాబాయ్ ఫిర్యాదు చేయలేదా.. ఇంతకంటే సాక్ష్యాలు కావాలా.. అని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నేతల అరాచకాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు గంగుల విజయసింహారెడ్డి, కేకే రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, నాసారి ప్రసాద్, పత్తి నారాయణ, రామచంద్రుడు, మధు, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుందాగా రాజకీయాలు
చేయడం నేర్చుకో
అరాచకాలు ఆపకపోతే ప్రజలే
తిరగబడతారు
మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి