రూ.28 లక్షల పొదుపు సొమ్ము స్వాహా | - | Sakshi
Sakshi News home page

రూ.28 లక్షల పొదుపు సొమ్ము స్వాహా

Jul 5 2025 6:12 AM | Updated on Jul 5 2025 6:12 AM

రూ.28

రూ.28 లక్షల పొదుపు సొమ్ము స్వాహా

● బుక్‌ కీపర్‌పై విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

వెలుగోడు: పొదుపు మహిళలు నెల నెల దాచుకున్న సొమ్మును ఓ బుక్‌ కీపర్‌ స్వాహా చేసిన ఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు పొదుపు సంఘాల నుంచి దాదాపుగా రూ.28 లక్షలు బుక్‌కీపర్‌ కాజేసినట్లు కలెక్టర్‌ రాజకుమారికి ఫిర్యాదులు అందడంతో అధికారులను విచారణకు ఆదేశించారు. విషయం తెలుసుకున్న పట్టణంలోని దాసరి పేట, కుమ్మరి పేటకు చెందిన పొదుపు గ్రూప్‌ సభ్యులు ఐకేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఐదేళ్లుగా బుక్‌కీపర్‌ పొదుపు సొమ్మును డ్రా చేసుకుని సొంతానికి వాడుకుని తిరిగి చెల్లించలేదని మహిళలు మండిపడ్డారు. బుక్‌ కీపర్‌ కుటుంబం వెలుగోడు నుంచి వేరే ఊరికి మారడంతో విషయం వెలుగు చూసిందని మహిళలు పేర్కొన్నారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని పొదుపు సంఘాల సభ్యులు డిమాండ్‌ చేశారు.

అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలి

నంద్యాల: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడు మన్యం వీరుడు అల్లూరు అన్నారు. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులకు అండగా నిలిచి. బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడని, ఆయన చూపిన ధైర్యం, తెగువ, స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాము నాయక్‌, పర్యాటక అధికారి, అల్లూరి సీతారామరాజు పుస్తక రచయిత సురేష్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

కర్నూలు (సెంట్రల్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్‌వీ శేషాద్రి తెలిపారు. సత్వర న్యాయం అందించాలనే ధ్యేయంతో ప్రతి మూడు నెలలకోసారి జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మార్చి తర్వాత శనివారం రెండోసారి జిల్లా లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 16 లోక్‌ అదాలత్‌ బెంచీలు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో కేసుల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు న్యాయమూర్తులు వారివారి స్థానాల్లో ఉండి కేసుల పరిష్కారం చేస్తారన్నారు. అన్ని రకాల సివిల్‌, రాజీ కాగల క్రిమినల్‌, రోడ్డు ప్రమాద, చెక్‌ బౌన్స్‌, బ్యాంకు, మున్సిపల్‌ కేసులు, అలాగే భార్యాభర్తల వివాదాలు, ఇన్సూరెన్స్‌, ప్రభుత్వ సేవలకు సంబంధించిన కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కారం చేస్తామని చెప్పారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట

ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా

నంద్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. గురు వారం అర్ధరాత్రి ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా నంద్యాల పట్టణంలో బైక్‌పై తిరుగుతూ గస్తీని పర్యవేక్షించారు. సమయపాలన పాటించని, అనుమానం ఉన్న వ్యాపార సముదాయాలు, బార్లు, వైన్‌ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని శ్రీనివాస్‌ సెంటర్‌, గాంధీ చౌక్‌,బంగారు అంగళ్ల వీధి, హరిజన పేట పెద్ద బండ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అర్ధరాత్రి వేళ పట్టణంలో తిరిగే ఆకతాయిలను ప్రశ్నించి, మళ్లీ కనిపిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గస్తీ సమయంలో తాళాలు వేసిన ఇళ్లు, రైల్వే స్టేషన్‌, బస్టాప్‌లు, ఆలయాలు, బ్యాంక్లు, ఏటీఎంలు, అన్ని ముఖ్యమైన కూడళ్లలోను తప్పక సందర్శించాలన్నారు. నిర్మానుష్యమైన ప్రదేశాలు, రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

రూ.28 లక్షల పొదుపు సొమ్ము స్వాహా 1
1/1

రూ.28 లక్షల పొదుపు సొమ్ము స్వాహా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement