
సీమపై చంద్రబాబుది కపట ప్రేమ
జూపాడుబంగ్లా: రాయలసీమ రైతాంగంపై సీఎం చంద్రబాబునాయుడు కపట ప్రేమ చూపుతున్నారని ప్రజా సంఘాల నాయకులు, రైతులు విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలలో జాప్యం కావడంతో ‘చలో పోతిరెడ్డిపాడు’కు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాలోని నంద్యాల, గోస్పాడు, రుద్రవరం, ఆత్మకూరు, నందికొట్కూరు, పాములపాడు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా సంఘాల నాయకులు, రైతులు 80 బన్నూరు నుంచి పోతిరెడ్డిపాడు వరకు ర్యాలీగా బయలుదేరారు. అయితే అధికారుల ఆదేశాల మేరకు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం అధ్వర్యంలో ఎస్‌ఐలు ఓబులేసు, లక్ష్మీనారాయణతో పాటు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రజా సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి రాజశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు, రైతుసంఘం జిల్లా సెక్రటరీ సుధాకర్ తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శ్రీశైలం డ్యాంలో 875.90 అడుగుల నీటిమట్టం చేరినా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు బలవంతంగా కొందరిని జీపులో ఎక్కించి తరలిస్తుండగా నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి సాగునీటిని విడుదలచేసే దాకా వెళ్లేదేలేదని భీష్మించి కూర్చొన్నారు. దీంతో సీఐ పోతిరెడ్డిపాడు ఈఈ నాగేంద్రకుమార్‌ను సంఘటనా ప్రాంతానికి రప్పించి సీఈ కబీర్‌బాషాతో మాట్లాడించారు. వారంలోగా నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినా వారు శాంతించలేదు. ఈనెల 6తేదీలోగా నీటిని విడుదల చేయకపోతే తామే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుబ్బరాయుడు, వీరన్న, సురేష్,రామకృష్ణ, రాముడు, కర్ణ, వాలయ్య, రంగమ్మ, ఈశ్వరమ్మ, సుధాకర్, సోమన్న, రామసుబ్బారెడ్డి, రణధీర్ రైతులు పాల్గొన్నారు.
శ్రీశైలం డ్యామ్ నిండుతున్నా నీళ్లు ఇవ్వరా?
చలో పోతిరెడ్డిపాడు ఉద్రిక్తత
80 బన్నూరు వద్ద రైతులు, ప్రజా సంఘాల నాయకుల అడ్డగింత