
రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలి
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, అప్పుడు ఆ ఉద్యోగానికి గుర్తింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ డేను పురస్కరించుకొని ఏపీఆర్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్‌తో పాటు జేసీ డాక్టర్ బి.నవ్య, ఇన్‌చార్జి డీఆర్వో బీకే వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, లక్ష్మీరాజు ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ భవన్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఏపీఆర్‌ఎస్‌ఏ సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలకు రెవెన్యూ తల్లివంటిదన్నారు. రెవెన్యూలో అనేక సంస్కరణలు వచ్చాయని, వాటిపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. తాను కడపలో డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణలో ఉన్న సమయంలో(2007–08) అనేక సంస్కరణలను అమలుచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నట్లు చెప్పారు. గుడివాడ ఆర్‌డీఓగా ల్యాండ్ రికార్డ్స్’లో ఆధార్‌సీడింగ్ ప్రక్రియను రూపొందించానన్నారు. కడప ఆర్‌డీఓగా కొప్పర్తిలో 6 వేలు, ఇళ్ల నిర్మాణాల కోసం 3వేల ఎకరాలు, 14రోడ్ల విస్తరణ భూసేకరణకు ప్రత్యేక యాప్‌ను తయారు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ కడపకు వెళ్లినప్పుడు రోడ్ల విస్తరణ చూస్తే తనకు ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు.
● జేసీ డాక్టర్ బి.నవ్య మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అతిప్రాచీనమైనదని, ఇప్పుడున్న మిగిలిన శాఖలన్నీ రెవెన్యూ నుంచే ఉద్భవించినవేనన్నారు. ప్రజలకు ఏమి కష్టాలు వచ్చినా రెవెన్యూ అధికారులనే ఆశ్రయిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు.
● అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు శశిదేవి, కిష్టోఫర్, జయన్న, విజయుడు, హుస్సేన్, రమణ, ఆదినారాయణ, రామన్న, ఎల్లరాముడు తదితరులను ఏపీఆర్‌ఎస్‌ఏ తరపున కలెక్టర్, జేసీలు సన్మానించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, అజయ్‌కుమార్, కొండయ్య, నాగప్రసన్న, సునీతాభాయ్, ఏఓ శివరాముడు పాల్గొన్నారు.

రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలి