
కూటమి పాలనలో ఒరిగిందేమీ లేదు
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీల అమల్లో ఘోరంగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ విమర్శించారు. శుక్రవారం సీపీఎం కార్యాలయంలో కూటమి ఏడాది పాలనపై సీపీఎం బుక్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అధికారంలోకి రావడం కోసమే రాష్ట్ర ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికే 143 వాగ్ధానాలు చేశారన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌కు కేంద్రం ఇచ్చిన నిధులు తప్పా ఒక్క రూపాయి కేటాయించలేదని, వేదవతి, గుండ్రేవుల రిజర్వాయర్ల ప్రస్తావనే లేదని, హంద్రీనీవా నత్తడనకన సాగుతోందన్నారు. జిల్లా ప్రాజెక్టులు పట్టించుకోకుండా బనకచర్లతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అంటున్నారని, ఇదంతా నాటకమేనని మండిపడ్డారు. రైతులు పండించిన పొగాకును కొనుగోలు చేయలేని, అప్పుడు స్మార్ట్ మీటర్లను వద్దని, ఇప్పుడు బలవంతంగా పెట్టిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.100 కోట్ల ఉపాధి బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. డీఎస్సీలో సగం పోస్టుల్లో కోత పెట్టారని విమర్శించారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇప్పటికై నా ప్రజలకు మేలు చేయాలని సూచించారు.సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. వైన్ షాపులు బార్లలా మారిపోయాయని, రోడ్లపైనే తాగుబోతులు తాగి తూళుతుండడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ, కేవీ నారాయణ, టి.రాముడు, ఓల్డ్ సిటీ కార్యదర్శిరాజశేఖర్ పాల్గొన్నారు.