
బైక్‌ల దొంగ దొరికాడు
● జల్సాలకు అలవాటు పడి అడ్డదారి
● ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ
● సీసీ ఫుటేజీ ద్వారా కేసును ఛేదించిన గోనెగండ్ల పోలీసులు
● 30 బైక్‌లు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు: మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. కూలీ పనుల వల్ల వచ్చే ఆదాయం సరిపోలేదు. దీంతో సులువుగా డబ్బు సంపాదించే మార్గంగా బైక్‌ల చోరీని ఎంచుకున్నాడు. బైక్‌లను అపహరించడం రూ. నాలుగైదు వేలకు అమ్మేయడం వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తూ వచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా వేసి దొంగను పట్టుకుని కటకటాలకు పంపారు. గోనెగండ్ల మండలం చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ఇళ్లముందు, బస్టాండ్లలో పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను అపహరించాడు. నకిలీ తాళాల సహాయంతో అపహరించి స్వగ్రామంలోని పాత ఇంట్లో దాచిపెట్టి కొన్నాళ్ల తర్వాత వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. కర్నూలు, ఎమ్మిగనూరు, గోనెగండ్ల ప్రాంతాల్లో వాహనదారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసుకున్న గోనెగండ్ల పోలీసులు సీఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడు కురువ వెంకటేష్‌గా గుర్తించారు. పెద్దమర్రివీడు గ్రామ రోడ్డులోని సుంకులమ్మ గుడి వద్ద ఉన్నట్లు గుర్తించి బుధవారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రం కర్నూలుకు తీసుకువచ్చి ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ ఉపేంద్ర బాబు, గోనెగండ్ల సీఐ విజయభాస్కర్‌తో కలసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బస్టాండ్లు, ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్‌గా చేసుకుని కురువ వెంకటేష్ చోరీలకు పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. కర్నూలు, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, దేవనకొండ, కోడుమూ రు, ఓర్వకల్లు ప్రాంతాల్లో ఇతను 30 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు విచారణలో అంగీకరించాడన్నారు. బైక్ చాసీ నెంబర్ ద్వారా గుర్తించి వాటిని యజమానులకు అప్పగించనున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు బైక్ దొంగలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నా రు. చోరీ చేసిన బైకులను జొన్నగిరి ప్రాంతాల్లో పొలాల పనులు చేసుకునే రైతులకు ఒక్కొక్కటి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అమ్మేశాడని ఎస్పీ వెల్లడించారు. వాహన తనిఖీల్లో కూడా దొంగలించిన వాహనాలు బయటపడ్డాయని వెల్లడించారు.
సిబ్బందికి నగదు రివార్డులు...
ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడంతో ప్రతిభను కనపరచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ నగదు రివార్డులతో అభినందించారు. గోనెగండ్ల సీఐ విజయభాస్కర్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు తేజేశ్వర్ కుమార్, దేవరాజు, కానిస్టేబుళ్లు లక్ష్మీకాంత్, వై.రాజు, వీరేష్ గౌడు, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, రమేష్ తదితరులను ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు.
జిల్లాలో 5 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు...
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్), ఎంపీ నిధుల నుంచి జిల్లా వ్యాప్తంగా 5 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాల్లో కూడా సీఎస్‌ఆర్, ఎంపీ, మున్సిపల్ నిధులతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నిరోధించడమే కాక వాటిని ఛేదించేందుకు కూడా ఉపయోగపడతాయన్నారు. మూడున్నర నెలల వ్యవధిలోనే 5 వేల సీసీ కెమెరాలు ప్రజల సహకారంతోనే ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల సహాయంతోనే ద్విచక్ర వాహన దొంగను గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లలో ఏపీకే ఫైల్స్ వస్తే వాటిని క్లిక్ చేయకూడదని, ఓపెన్ చేయకూడదన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కూడా తన పాత్ర పోషించాలన్నారు.