
‘వందనం’ కొందరికే!
● 485 మంది తల్లులకు కోత
● సచివాలయాల చుట్టూ తల్లుల ప్రదక్షిణలు
ఉయ్యాలవాడ: తల్లికి వందనం పథకం అభాసుపాలైంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బు జమ చేస్తామని చెప్పిన కూటమి నాయకులు అధికారం లోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. మండలంలో 2,502 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులు కాగా 485 మంది విద్యార్థులకు కోత విధించారు. వారందరికీ నగదు జమ కాలేదు. ఉయ్యాలవాడకు చెందిన మద్దిరాల మరియమ్మ, మారిగాళ్ల భాగ్యమ్మ, గుల్లకుంట మరియమ్మ, మల్లేశ్వరితోపాటు మరి కొందరు తల్లులు మంగళవారం ఉయ్యాలవాడ గ్రామ సచివాలయానికి చేరుకుని తమకు తల్లికి వందనం డబ్బు పడలేదని, జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని, మరి కొందరు తల్లులు ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరికి మాత్రమే డబ్బు పడిందని, మిగతా ఇద్దరికి ఎందుకు జమ కాలేదని సచివాలయ సిబ్బందితో మొరపెట్టుకున్నారు. జమ అయిన వారికి కూడా రూ.15 వేలకు బదులు రూ.2 వేలు కోత విధించడంతో కూటమి ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉందని, కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, భూమి ఆన్‌లైన్‌లో 10 ఎకరాల మెట్ట కంటే ఎక్కువగా చూపుతుందని తదితర సాకులతో అర్హుల జాబితాలో తమ పేర్లు లేకుండా చేశారని తల్లులు ఆందోళన వ్యక్తం చేశారు.
మాకుండేది 3.20 ఎకరాలే..
నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి పెళ్లి చేశాను. రెండో కూతురు వర్షిత ఉయ్యాలవాడ మోడల్‌స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి వచ్చింది. ఈఏడాది రాలేదు. సచివాలయంలో అధికారులను అడిగితే 12 ఎకరాల మెట్టభూమి ఉందని అనర్హుల జాబితాలో చేర్చారంట. మాకుండేది 3.40 ఎకరాలే.
– మారిగాళ్ల భాగ్యమ్మ, ఉయ్యాలవాడ

‘వందనం’ కొందరికే!