
చిన్నటేకూరు విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ
నీట్‌లో 13 మందికి ఎంబీబీఎస్ సీట్లు
● మరో ఏడుగురికి బీడీఎస్ అవకాశం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు బీఆర్ అంబేద్కర్ ఐఐటీ/మెడికల్ అకాడమీ విద్యార్థులు ఇటీవల విడుదలైన నీట్ 2025, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నీట్ ఫలితాల్లో 20 మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయని, వీరిలో 13 మందికి ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందనున్నారన్నారు. మిగిలిన వారికి బీడీఎస్‌లో సీట్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొత్తం 46 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. వీరిలో 31 మంది దేశంలోని ఐఐటీ పాట్నా, భువనేశ్వర్, పాల్కాడ్, గాంధీనగర్, ఎన్‌ఐటీ కాలికట్, పాట్నా, అగర్తాలా, శిబుపూర్, జైపూర్, రాయపూర్, ఏపీ, దుర్గాపూర్, నాగపూర్, కుండ్లి, జబల్‌పూర్, సీయు బిలాస్‌పూర్, ఢిల్లీ, తేజ్‌పూర్, శ్రీసిటీ(ఐఐఐటీ ) ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందుతున్నారన్నారు. మిగిలిన వారికి ప్రముఖ 10 కళాశాలల్లో ప్రవేశం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అకాడమీలో కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులే అధిక శాతం ఉన్నారన్నారు. అకాడమీలోని అధ్యాపక బృందం నిరంతర కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయన్నారు.