
రైతుల ఆశలపై ‘నీళ్లు’
● ఆయకట్టుకు అందని సాగునీరు
ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సరిగ్గా కురవలేదు. కాలువలకు సక్రమంగా సాగు నీరు కూడా రాలేదు. దీంతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు నీరు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పట్టించుకోకుండా రైతుల ఆశలపై ‘నీళ్లు’ చల్లింది.
ఇదీ ప్రతిపాదన..
ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు హెచ్‌ఎల్సీ మెయిన్ కాలువ నుంచి నీరు వస్తుంది. మొత్తం 14,555 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కాలువకు 650 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు. అయితే 150 నుంచి 200 క్యూసెక్కులు సాగునీరు (హెచ్‌ఎల్సీ మెయిన్ కాలువ నుంచి) మించి విడుదల కావడం లేదని రైతులు వాపోయారు. చిప్పగిరి గ్రామానికి రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము (డీపీ)ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ తూము ఏర్పాటు చేస్తే దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
పట్టించుకోని ప్రభుత్వం
కాలువకు నీరు రాక, పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలనే అధికారుల ప్రతిపాదనను పక్కన పెట్టారు. దీంతో ఆయకట్టు రైతులకు పంటలు పండటం లేదు.
హామీలను గాల్లోకి వదిలేశారు
ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలను గాల్లోకి వదిలేశారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. సాగు ప్రాజెక్టులు నిర్మించాలని, కాలువలకు తూములు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం లేదు. హెచ్‌ఎన్‌ఎస్ నుంచి ఏబీసీకి సాగునీరు విడుదల చేయాలి. నగరడోణ గ్రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తిచేయాలి.
– బి. విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే
అనుమతులు రాలేదు
ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు సాగుటిని విడుదల చేసేందుకు హెచ్‌ఎన్‌ఎస్‌కు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలని గతంలో రూ. 3 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. వాటర్ యూజర్స్ కమిటీ పర్యవేక్షణ చేయాల్సి ఉంది.
– చంద్రశేఖర్, హెచ్‌ఎల్సీ ఆలూరు ఏబీసీ డీఈ

రైతుల ఆశలపై ‘నీళ్లు’