
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం
● ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా
‘కూటమి’ పాలన
● తప్పుడు కేసులు, అసత్య
ప్రచారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
● హామీలు అమలు చేయని
సీఎం చంద్రబాబు
● మాజీ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
డోన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్ పట్టణంలోని తన స్వగృహంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టులు చేయించి శునకానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
మోసం బాబు నైజం
అధికార దాహంతో నోటికి వచ్చిన హామీలనిచ్చి విస్మరించడం సీఎం చంద్రబాబు నాయుడు నైజ మని బుగ్గన ఆరోపించారు. సూపర్‌సిక్స్ పథకాలంటూ అట్టడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు గత చరిత్ర సమస్తం అబద్ధపు వాగ్దానాలు, అసత్య ప్రచారాలతో నిండిపోయిందన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. కక్ష సాధింపు చర్యలతో, అక్రమ అరెస్టులతోనే ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందని బుగ్గన ధ్వజమెత్తారు. సమావేశంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్‌కుమార్, మున్సిపల్ వైస్‌చైర్మన్ జాకీర్‌హుసేన్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షులు తిరునాంపల్లె తిరుమలరెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, క్లస్టర్ యూనిట్ మాజీ సభ్యులు నాగభూషణంరెడ్డి, జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పోసు్ట్రపసాద్, పార్టీ నాయకులు కురుకుందు హరి, గజేంద్రారెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, చంద్ర, ధారా ప్రతాప్‌రెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం..
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బుగ్గన అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం డొల్లతనాన్ని జానాలకు అర్థమయ్యేరీతిలో వివరించాలని తెలిపారు. తల్లికి వందనం, రైతు భరోసా, విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాలకు మంగళం పాడి కూటమి ప్రభుత్వం తల్లి, పిల్లల ఉసురు పోసుకుందని ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుపరిపాలన చేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందనే విషయం అందరికీ తెలిసేందనన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతీయ, రాజకీయ పార్టీల భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక హామీ కూడా అమలు చేయలేదని, వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.