
అన్న ప్రసాద వితరణపై పర్యవేక్షణ
శ్రీశైలం టెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని అధికారులను ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం రాత్రి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణలో ఆయా వంటకాలన్నీ రుచికరంగా ఉండేటట్లు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి హాలును కూడా ప్రత్యేకంగా సిబ్బంది ఒకరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. అన్నప్రసాద వితరణకు సంబంధించి సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉదయం వేళలో అన్నప్రసాదాలను, సాయంత్రం అల్పాహారాన్ని ఎటువంటి ఆలస్యం కాకుండా భక్తులకు అందజేస్తుండాలన్నారు. భక్తులతో మర్యాదతతో మెలగాలని అన్నప్రసాద వితరణ సిబ్బందిని ఆదేశించారు.
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ప్యాపిలి: పైసా పైసా కూడబెట్టుకుని చిట్టీలు వేసుకున్న వారికి ఒ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో బాధితులు లబోదిబో అంటూ శనివారం ప్యాపిలి పోలీసులను ఆశ్రయించారు. దాదాపు రూ. 35 లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలుస్తోంది. ప్యాపిలికి చెందిన సుభాన్ బాషా గత కొద్ది సంవత్సరాలుగా ప్యాపిలిలో పలు వ్యాపారాలు చేస్తూ ప్రజల వద్ద నమ్మకం కుదుర్చుకున్నాడు. దీంతో అతన్ని నమ్మిన పలువురు అతని దగ్గర భారీగా చిట్టీలు వేశారు. చిట్టీ ముగిసినా పలువురికి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బుకు కూడా ప్రతి నెలా వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. మరి కొందరికి డబ్బులు ఇవ్వకుండా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. చిట్టీలతో పాటు పలువురి దగ్గర భారీ మొత్తంలో అప్పులు కూడా చేశాడు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ప్యాపిలిలో సుభాన్‌బాషా కనిపించకపోవడం, ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తాము మోసపోయినట్లు గ్రహించారు. ఈ విషయమై సుభాన్ బాషా తండ్రి సిలార్ బాషాను బాధితులు నిలదీయగా తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని చెప్పాడు. దీంతో బాధితులు బండి నరేంద్ర కుమార్, ఆలా ప్రభాకర్ రెడ్డి, షేక్ ఖాజా హుసేన్,వెంకటేశ్, మలికే సర్వర్ సాహెబ్, పలనాటి అంజనమ్మ, బండి నాగరాజు తదితరులు ఎస్‌ఐ మధుసూదన్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 10,192 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 9,103 మంది పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ సునిత తెలిపా రు. 1,089 మంది గైర్హాజరయ్యారయ్యారన్నా రు. అలాగే రెండో సంవత్సరం పరీక్షలకు 2,959 మంది విద్యార్థులకు గాను 2,779 మంది హాజరు కాగా 180 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. శనివారం కామర్స్, కెమిస్ట్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సునిత తెలిపారు.
మహానందిలో
వీకెండ్ సందడి
మహానంది: మహానందిలో శనివారం వీకెండ్ సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కొనసాగింది. స్థానిక అలంకార మండపంలో వేదపండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని ఆధ్వర్యంలో ఆలయ పండితులు, అర్చకులు శ్రీ గంగ, శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి దంపతులకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం చేపట్టారు. రాత్రి ఏకాంతసేవ పూజ లు నిర్వహించారు. యాగశాలలో స్వామి, అమ్మవారి దంపతులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా ఏకాంత సేవ పూజలు చేపట్టారు.

అన్న ప్రసాద వితరణపై పర్యవేక్షణ