
సీఎం పర్యటనలో మార్పు
కర్నూలు(సెంట్రల్)/(అగ్రికల్చర్)/కల్లూరు/పాణ్యం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మారింది. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న పాణ్యంలో సీఎం పర్యటించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని కర్నూలుకు మార్చారు. దీంతో గత రెండు రోజుల నుంచి పాణ్యంలో ఉన్న అధికారులు ఏర్పాట్లను విరమించారు. ప్రతినెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారు. ఈ నెల 17న కర్నూలులో సీఎం పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స హాలులో అఽధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కర్నూలులోని సీక్యాంపు రైతుబజార్‌లో జరిగే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు, ఇద్దరు రైతులతో మాట్లాడతారని తెలిపారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారని, మూడు వేల మందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకముందు జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రైతు బజార్, ప్రజా వేదిక ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి సీఎం పర్యటనను విజయవంతం చేద్దామన్నారు.
● స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమానికి జేసీ నవ్య ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సహాయకులుగా ఉంటారు. ప్రజావేదిక ఇన్‌చార్జిగా జెడ్పీ సీఈఓ వ్యవహరిస్తారు.
17న కర్నూలు రానున్న ముఖ్యమంత్రి