
పరీక్షలు ముగిసిన ఆనందంలో విద్యార్థినులు
● ముగిసిన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు
నంద్యాల (సిటీ): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 124 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 34,639 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,260 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవయ్యశెట్టి వెల్లడించారు. 29 పరీక్షా కేంద్రాలను ఆర్‌ఐఓ, డీవీఈఓ, హెచ్‌పీసీ, డీఈసీ, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించామన్నారు. కర్నూలు నారాయణ జూని యర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ముగ్గురు, గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇద్దరు, వెల్దుర్తి జూనియర్ కళాశాల, కోవెలకుంట్ల ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జేసీ కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఏడుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడడంతో డిబార్ చేసినట్లు ఆర్‌ఐఓ పేర్కొన్నారు. కాగా తొలి సంవత్సరం పరీక్షలు ముగియడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద సంతోషంతో కేరింతలు కొట్టారు. మళ్లీ సెకండ్ ఇయర్‌లో కలుసుకుందామంటూ స్నేహితులకు బైబై చెప్పుకున్నారు.

బస్సులో వెళ్తూ ఉత్సాహం వ్యక్తం చేస్తూ..