
ప్రేమపెళ్లి ‘ముసుగు’
తొమ్మిది నెలలు.. ఓ మహిళ జీవితంలో మరపురాని కాలం. ఒక్కో నెల ఒక మధురానుభూతి. కనిపించని లోకంలో కదిలికలే ఆమె లోకం. వినిపించని అరుపులకు ఆ ముఖమే వికసించే నవ్వులు. వెన్ను విరిగే నొప్పులను భరిస్తుంది.. పురిట్లోని బిడ్డను చూసి ఆ బాధను దిగమింగుతుంది. అందరి జీవితం ఇలా ఉంటే.. ఆ తల్లి ‘కడుపు కోత’ మాటలకందని వెత. పెళ్లి చెడింది.. ప్రేమ అగాథమైంది. మోసానికి పుట్టిన పాప కళ్లు తెరవక మునుపే తల్లికి దూరమైంది.. కన్న పేగుకు దూరంగా 18 నెలల నుంచి అజ్ఞాతంలో పెరుగుతోంది. ఆ తల్లి ప్రేమించినోడి రాక్షసత్వానికి మౌనంగా రోదిస్తోంది.. ఊహకందని బిడ్డ రూపం మనసులో నిలుపుకొని న్యాయదేవత ఎదుట జీవచ్ఛవంగా మిగిలింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు
కేసు నమోదు చేసిన పోలీసులు పనిచేస్తున్న ప్రాంతం.. కలిసి ఉన్న ఇల్లు.. డెలివరీ జరిగిన ఆసుపత్రి.. తదితర ప్రాంతాల్లో విచారించి కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. అప్పుడు రాకేష్ ఆ బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు చేయించగా.. వాస్తవం తేలింది. ఈ నేపథ్యంలో బిడ్డను తనకు అప్పగించాలని గాయత్రి కలెక్టర్, ఎస్పీ, డీజీపీ, మహిళా కమిషన్, దిశ పోలీసుస్టేషన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలతో పాటు ఎన్నో మెట్లు ఎక్కింది, దిగింది.
బిడ్డ కోసం గాయత్రి చివరి అస్త్రంగా హైకోర్టును ఆశ్రయించి ‘హెబియస్ కార్పస్’(బిడ్డ కన్పించడం లేదు) పిటిషన్ వేసింది. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు రాయదుర్గంలోని అన్నపూర్ణ, కళ్యాణ్‌కృష్ణ వద్ద పెరుగుతున్న బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు తీర్పు ఆధారంగా బిడ్డను అప్పగిస్తామని చెప్పారు. డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా పోలీసులు రాకేశ్‌కు పుట్టిన బిడ్డే అని తేల్చడంతో అతను కూడా కోర్టులో అదే విషయాన్ని అంగీకరించాడు. చివరకు కోర్టు నిర్ణయం తీసుకునే సమయంలో బిడ్డను ఇన్నిరోజులు పెంచిన కళ్యాణ్‌కృష్ణ, అన్నపూర్ణ దంపతులు కూడా కోర్టులో సోమవారం(ఈ నెల 27న) తమ బిడ్డ కనిపించడం లేదని ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ వేశారు. ఇదిలాఉంటే తన వల్ల తల్లిదండ్రులకు మచ్చ రాకూడదనే ఉద్దేశంతో గాయత్రి ఒంటరి పోరాటం చేస్తోంది.
● ఓ యువతి జీవితంలో చీకటి ● నమ్మించి మోసగించిన జూనియర్ అసిస్టెంట్
● బిడ్డ పుట్టిన తర్వాత మరొకరితో వివాహం ● ప్రశ్నించడంతో దారుణంగా దాడి
● పురిట్లోనే పసికందు మాయం ● ఒంటరి పోరాటం చేస్తున్న గాయత్రి
హాలహర్వికి చెందిన గాయత్రి అదే మండలంలోని ఓ సచివాలయంలో ఉద్యోగం చేస్తోంది. చిన్న వయస్సులోనే జీవితంలో స్థిరపడే అవకాశం రావడంతో పెళ్లి చేసుకొని హాయిగా బతికేద్దాం అని అందరి అమ్మాయిల్లానే ఎన్నో కలలు కనింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకునితో సంబంధం కుదర్చగా.. నిశ్చితార్థం పూర్తయింది. అయితే విధి నిర్వహణలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాకేష్ ఈమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే అతను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో తనకు అప్పటికే నిశ్చితార్థమైన విషయాన్ని బయటపెట్టి దాటవేసింది. ఇలా.. ఆమె మెడలో మూడు ముళ్లు పడినా, ఆ వివాహం ఊహించని గొడవలతో ఐదు రోజులకే పరిమితమైంది. తిరిగి కార్యాలయానికి చేరుకోగానే ఏం జరిగిందని రాకేష్ ఆమెను ఆరా తీయడంతో జరిగిన విషయాన్ని వివరించింది. ‘‘నా ప్రేమ స్వచ్ఛమైంది.. దేవుడు నిన్ను నాతో కలిపేందుకే ఈ పెళ్లి పెటాకులు చేశాడు’ అనే మాయ మాటలతో కన్నీరు కార్చడంతో పాటు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. జీవితం ముళ్లబాటగా మారిన పరిస్థితుల్లో అతని నయవంచనను గుర్తించలేక సరేనంది. ఇరువురి కులాలు వేరు కావడం, కుటుంబ సభ్యులకు తెలిస్తే ఒప్పుకోరనే భావనతో కర్నూలు చిన్న పార్కు సమీపంలోని మేరిమాత చర్చి వద్ద గాయత్రి మెడలో తాళి కట్టి కాపురం పెట్టారు.
మరో యువతితో వివాహం
రాకేష్ స్వస్థలం ఆదోని. అక్కడ మరో ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్మిని కూడా ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇంతలో విషయం తెలుసుకున్న గాయత్రి అక్కడికి వెళ్లి గొడవ చేసింది. అయినప్పటికీ నెల తిరక్కుండానే ఇరువురి కులాలు ఒక్కటి కావడంతో అతను లక్ష్మి పెళ్లి చేసుకోగా.. దిక్కుతోచని గాయత్రి కర్నూలు త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎందుకు ఇలా చేశావని అతడిని ప్రశ్నించేందుకు ఆదోనికి వెళ్లగా తీవ్రంగా దాడిచేసి గాయపరిచారు.
కళ్లు తెరిచి చూస్తే..
ఆ ప్రేమ, పెళ్లికి తీపిగుర్తుగా గర్భం దాల్చ డం, కర్నూలులోని అపెక్స్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి బిడ్డలేదు. ఎక్కడని ప్రశ్నిస్తే అనారోగ్యంగా ఉండటంతో పెద్దాసుపత్రిలో చేర్పించానన్నాడు. నమ్మింది.. డిశ్చార్చ్ తర్వాత కూడా బిడ్డ తన ఒడి చేరకపోవడంతో మరోసారి ఆరాతీసింది. నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, బంధువుల వద్ద ఉంచానన్నాడు. పాలు ఎలాగంటే, మరొకరితో ఇప్పిస్తున్నాం.. ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. చివరికి ఎలాగో ఆ పాపను అనంతపురం జిల్లా రాయదుర్గంలో పిల్లలు లేని తన సమీప బంధువులకు అప్పగించినట్లు విషయం బయటపడింది. ఈ విషయమై నిలదీయడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
కేసు కోర్టు పరిధిలో ఉంది
గాయత్రికి జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేశాం. డీఎన్‌ఏ టెస్ట్‌లో రాకేశ్, గాయత్రిలకు పాప పుట్టిన విషయం తేలింది. ఆ తర్వాత పాప కోసం ఆమె కోర్టును ఆశ్రయించింది. కేసు కోర్టులో నడుస్తోంది. త్వరలోనే జడ్జిమెంట్ వస్తుంది.
– మహ్మద్ తబ్రేజ్,
సీఐ, త్రీటౌన్
నాకిక బిడ్డే లోకం
ప్రేమ పేరిట వెంటపడ్డాడు. పెళ్లి చేసుకున్నాక కలిసి ఉన్నన్ని రోజులు నా జీతంతోనే గడిపాడు. బంగారం కూడా తీసేసుకున్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత అసలు రూపం బయటపడింది. పాపను కళ్లారా చూసుకునే అవకాశం లేకుండా పురిట్లోనే మాయం చేశాడు. ఇప్పుడు పాపకు 18 నెలలు. కనీసం పేరు పెట్టే అవకాశం కూడా లేకుండాపోయింది. బిడ్డ లేకపోయింటే నా ఖర్మ ఇంతేలే అనుకునేదాన్ని. ఇప్పుడు సమాజం నన్ను వేలెత్తి చూపుతోంది. అన్నింటినీ భరించి నా బిడ్డ కోసం బతుకుతున్నా. పాప కోసమే పోరాటం చేస్తున్నా. – గాయత్రి, బాధితురాలు
