కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏపీ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జోన్–4 అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ జి. రాజేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి పాత కేంద్రాలు తొమ్మిదిని మినహాయించి కొత్తగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మరో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ, బేతంచెర్ల, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆదోని, కల్లూరు (రెండు), కర్నూలులో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. కొత్తగా గుర్తించిన ఈ కేంద్రాల్లో 1,810 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేకునేందుకు అవకాశం ఉందని, ఉమ్మడి జిల్లాలో అర్హులైన బీసీ విద్యార్థులుసద్వినియోగం చేసుకోవాలన్నారు.