
నంద్యాల: సహకార సొసైటీల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఆప్కాబ్ రాష్ట్ర చైర్‌పర్సన్ ఝాన్సీరాణి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన నంద్యాలలో డీసీసీబీ రీజినల్ కార్యాలయాన్ని ఝాన్సీరాణి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీనాగిరెడ్డి, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథరెడ్డి, డీసీసీబీ చైర్‌పర్సన్ మహాలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఝాన్సీరాణి మాట్లాడుతూ సొసైటీల పర్యవేక్షణకు వీలుగా ప్రతి కొత్త జిల్లాలో డీసీసీబీ రీజినల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సొసైటీలను రైతులు, ప్రజలకు మరింత దగ్గర చేస్తామన్నారు. డీసీసీబీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, కల్యాణ మండపాలు, గోడౌన్లు తదితరాలు నిర్మించి, వాటి ద్వారా ఆదాయం పెంచి సొసైటీలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రాథమిక సహకార సంఘాల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర సేవలను పొందవచ్చన్నారు. వీటి ద్వారానే రుణాలు మంజూరు, చెల్లింపులు చేసేలా వీలవుతుందన్నారు. రైతులు, వ్యాపారులకు సహకార సంఘాల నుంచి రుణ సదుపాయం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. త్వరలోనే ప్రాథమిక సహకార సంఘాల సేవలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు వారోత్సవాలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆప్కాబ్ ఆధ్వర్యంలో రైతులకు పంట రుణాలు సహకార సొసైటీల ద్వారా అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీసీసీబీ చైర్‌పర్సన్ మహాలక్ష్మి మాట్లాడుతూ రూ.3,500 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలో ఐదో అతిపెద్ద బ్యాంకుగా కర్నూలు డీసీసీబీ నిలిచిందన్నారు. నంద్యాలో రీజినల్, బనగానపల్లెలో కార్యాలయాల నిర్మాణాలను త్వరలోనే చేపడతామన్నారు. సహకార సొసైటీల ద్వారా 10,630 మంది రైతులకు రూ.460.64 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ రామాంజనేయులు, జనరల్ మేనేజర్ శివలీల, జిల్లా సహకార అధికారి విజయకుమారి, ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటకృష్ణ, ఆప్కాబ్ డీజీఎం విజయ్‌కుమార్, నంద్యాల కేడీసీసీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ హుసేన్‌బాషా, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, సహకార కేంద్ర బ్యాంకు పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కొత్త జిల్లాలో డీసీసీబీ
రీజినల్ బ్రాంచ్‌ల ఏర్పాటు
డీసీసీబీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు,
కల్యాణ మండపాలు, గోడౌన్ల నిర్వహణ
ఆప్కాబ్ రాష్ట్ర చైర్‌పర్సన్ ఝాన్సీరాణి