
లక్ష్మీకళ మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త రామగోపాల్
ఓర్వకల్లు: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. తెలంగాణ రాష్ట్రం ఐజ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రామగోపాల్ అతని భార్య లక్ష్మీకళ(45)తో కలసి బైక్‌పై తమ సమీప బంధువులు బేతంచెర్లలో సుంకులపరమేశ్వరికి చేస్తున్న పూజ కార్యక్రమానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఓర్వకల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రమాదవశాత్తూ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న లక్ష్మీకళ కిందపడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. హైవే పెట్రోల్ వాహనంలో మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.