
స్పందన కార్యక్రమంలో అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ కోటేశ్వరరావు
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు(సెంట్రల్): స్పందన కార్యక్రమానికి వచ్చే సమస్యలకు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపాలని అధికారులను కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా సమస్యలకు పరిష్కారాలు చూపాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిసనర్లు శ్రద్ధ చూపాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని సీఎంఓ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారని, నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డి, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘స్పందన’కు వచ్చిన సమస్యల్లో కొన్ని...
● తనకు నాలుగు ఎకరాల పొలం ఉందని, అందులో ఎకరా పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని, తగిన చర్యలు తీసుకోవాలని తుగ్గలికి చెందిన మేఘన ఫిర్యాదు చేసింది.
● తన పొలంలో ఉన్న బావిని గ్రామ నీటి అవసరాలకు తీసుకున్నారని, అధికారులు ఇచ్చే పరిహారం చాలడంలేదని, తన బావిని తన వదిలి వేయాలని కర్నూలు మండలం నూతనపల్లెకు చెందిన నడిపి రాముడు కోరారు.
● తనకు పక్షపాతం ఉందని, సదరం క్యాంప్‌లో తక్కువ పర్సెంటేజ్‌తో ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, మరోసారి సదరానికి అవకాశం ఇవ్వాలని కర్నూలు మండలం మామిదాలపాడుకు చెందిన అశోక్‌కమార్ విన్నవించారు.
● పొలంలో పంటలు వేయకుండా బోయ తలారి మద్దయ్య అడ్డుపడుతున్నారని, తగని చర్యలు తీసుకోవాలని కృష్ణగిరి మండలం పుట్లూరుకు చెందిన బండారు మాదన్న ఫిర్యాదు చేశారు.
● కల్లూరు పరిధిలోని విఠల్ నగర్‌లో అగ్రసేని సంస్థ నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్‌పై అనేక అభ్యంతరాలు ఉన్నాయని, వాటిపై పరిశీలన చేయాలని రాయలసీమ యువజన పోరాట సమితి నాయకులు వీవీనాయుడు, ఎ.రామిరెడ్డి, పి.అశోక్ కలెక్టర్‌కు విన్నవించారు.