
ఆర్థిక సాయం అందిస్తున్న ఎస్పీ
బొమ్మలసత్రం: విధి నిర్వహణలో అనారోగ్యంతో ముగ్గురు హోంగార్డులు మృతి చెందగా జిల్లా ఎస్పీ వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో డోన్ పరిధిలో పని చేస్తూ మృతి చెందిన హోంగార్డులు మనోహరరెడ్డి, రమేష్ కుటుంబీకులకు ఫ్లాగ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి రూ. 10 వేల చెక్కును అందజేశారు. అలాగే హోమ్‌గార్డు ప్రదీప్ కుటుంబ సభ్యులకు రూ. 15 వేల చెక్కును అందించామని వివరించారు. ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ రమణ, ఏఆర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తదితరులు ఉన్నారు.
కురువలకు రాజకీయ
ప్రాధాన్యత కల్పించాలి
కర్నూలు(అర్బన్): అన్ని పార్టీలు కురువలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు కోరారు. బీసీ విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన సోమవారం బీసీ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ కురువలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌పై ఏప్రిల్ 3, 4 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలు కురువలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కర్నూలులో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కురువ సంఘాల నాయకులు పంచలింగాల నాగరాజు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇన్‌చార్జి జోషి, కార్పొరేటర్ పరమేష్, కురువ సంఘం నగర అధ్యక్షులు తౌడు శ్రీనివాసులు, మహేంద్ర, నారాయణ, పెద్దనాగన్న, మదాసి, మదారి కురువ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, ఆర్‌వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ తదితరులు హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడుతున్న జబ్బల శ్రీనివాసులు