
రైతుకు టిఫిన్ క్యారియర్ అందజేస్తున్న జేడీ రామచంద్రయ్య
కర్నూలు(అగ్రికల్చర్): కృత్రిమ గర్భధారణతో నాటు గేదెలు, ఆవుల ద్వారా మేలు జాతి దూడలను అభివృద్ధి చేసుకోవచ్చని జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రయ్య తెలిపారు. సోమవారం కర్నూలు మండలం పి.రుద్రవరం గ్రామంలో జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా నాటు గేదెలు, ఆవులకు పుట్టిన 42 మేలుజాతి దూడలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ లింగనిర్ధారిత వీర్యం ద్వారా పెయ్య దూడలు మాత్రమే అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. దూడలకు కాల్షియం టానిక్‌లు, దూడల యజమానులకు టిఫిన్ క్యారియర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ది సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, కర్నూలు డివిజన్ డీడీ దుర్గాప్రసన్నబాబు, కోడుమూరు ఏరియా పశువైద్యశాల ఏడీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు
జిల్లా విద్యార్థి
కర్నూలు సిటీ: జిల్లా విద్యార్థిని రాజా సుహాని తయారు చేసిన వేరుశనగ కాయల నుంచి విత్తనాలను వేరు చేసే యంత్రం జాతీయ స్థాయి ఇన్‌స్సైర్ మనక్ పోటీలకు ఎంపికై ంది. విద్యార్థినిని సోమవారం తన కార్యాలయంలో డీఈఓ డాక్టర్ వెంకట రంగారెడ్డి అభినందించారు. డీఈఓ మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో ఆన్‌లైన్‌లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో 24 ప్రాజెక్టులు పాల్గొన్నాయన్నారు. ఇందులో కర్నూలు అథీనా స్కూల్ విద్యార్థిని రాజా సుహాని ప్రదర్శించిన యంత్రం అందరి ప్రశంసలు అందుకుందన్నారు. త్వరలో దేశ రాజధానిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని విద్యార్థినికి డీఈఓ సూచించారు. అభినందన కార్యక్రమంలో జిల్లా సైన్స్ టీచర్ రంగమ్మ, గైడ్ టీచర్ డి.రసూల్ రాయల్ పాల్గొన్నారు.
యంత్రం ఎలా పనిచేస్తుందంటే..
వేరుశనగకాయల నుంచి విత్తనాలు వేరు చేసేందుకు రైతులకు అధిక ఖర్చు అవుతోంది. ఖర్చు తగ్గించడంతోపాటు సమయాన్ని ఆదా చేసేందుకు యంత్రాన్ని తయారు చేశారు. ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేకపోయినా ఇది పని చేస్తుంది. యంత్రం తయారీకి రూ. 2 వేలు మాత్రమే ఖర్చు వస్తుంది. యంత్రంలో వేరుశనగ కాయలు వేసి హ్యాండిల్‌నుతిప్పితే సరిపోతుంది. తక్కువ ఖర్చుతో విత్తనాలు సలువుగా వేరు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ 4 నుంచి ఉపాధి శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలకు మగ్గంవర్క్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్, పెయింటింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజుల శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 4 నుంచి మొదలవుతుందన్నారు. శిక్షణ కాలంలో ఉచిత బోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు 63044 91236 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

వేరుశనగకాయల నుంచి విత్తనాలను వేరు చేసే యంత్రంతో విద్యార్థిని రాజా సుహాని