లెక్క తప్పితే వేటే!
ఎన్నికల ఖర్చులు సమర్పించాల్సిందే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల్లో చేసిన ఖర్చుల లెక్కలను 45 రోజుల్లో అప్పగించాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే అనర్హత వేటు తప్పదని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారిలో పలువురిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన 381 మందిపై అనర్హత వేటు పడింది. ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోయాం కదా అని.. లెక్కలు ఇవ్వకపోవడంతో వారిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో వారు మూడేళ్లపాటు మరే ఇతర పదవులకు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఇక మరికొంత మంది వార్డు సభ్యులుగా గెలుపొందిన వారు కూడా లెక్కలు ఇవ్వకపోవడంతో అనర్హత వేటు పడి పదవిని కోల్పోయారు. వార్డు సభ్యులుగా పోటీ చేసిన ఓడిపోయిన వారిలో చాలా మంది లెక్కలు ఇవ్వకపోవడంతో వారిపైనా అనర్హత వేటు పడింది.
ప్రతి అభ్యర్థి లెక్కలు ఇవ్వాలి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తాను ఎన్నికల్లో నామినేషన్ వేసిన నాటి నుంచి పోలింగ్ వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారన్న లెక్కలు ఇవ్వాలి. ప్రతి ఎన్నికల్లోనూ అధికారులు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నా.. కొందరు గెలిచిన అభ్యర్థులు వాటిని పట్టించుకోవడం లేదు. మరోవైపు ఓడిపోయిన వారైతే పూర్తిగా వదిలేస్తున్నారు. అయితే గెలిచిన వారు ఉన్న పదవిని పోగొట్టుకోవడమే కాకుండా, ఓడిపోయిన వారితో సమానంగా గెలిచిన వారు కూడా మూడేళ్లపాటు మరే పదవికి పోటీ చేయలేని పరిస్థితి వస్తోంది. అందుకే ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రతి అభ్యర్థి ఎన్నికల సంఘానికి లెక్కలు ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. లేదంటే అనర్హత వేటు తప్పదని సూచిస్తున్నారు.
నోటీసులు పంపినా పట్టించుకోలే..
2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 381 మంది సర్పంచ్‌లుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే వారంతా ఎన్నికల ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారులకు ఇవ్వలేదు. ఖర్చుల వివరాలు పంపించాలని వారికి పలుమార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదు. దీంతో వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక వార్డు సభ్యులుగా గెలిచినవారిలో 586 మంది ఎన్నికల్లో ఎంత డబ్బులు ఖర్చు చేశారనే వివరాలను ఇవ్వలేదు. పలుమార్లు వారికి సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ఎన్నికల సంఘం ఆయా వార్డు సభ్యుల పదవుల నుంచి తొలగించింది. అదే ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా పోటీ చేసి చాలా ఓడిన వారిలో 3,372 ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులకు సంబంధించిన వివరాలను ఇవ్వకపోవడంతో వారిని మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా లెక్కలు ఇవ్వాలి. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు అందించాలి. లేదంటే గెలిచిన వారు పదవులు కోల్పోతారు. మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారు. ఓడిన వారు కూడా ఇవ్వాల్సిందే. లేదంటే వారిపైనా మూడేళ్ల పాటు అనర్హత వేటు పడుతుంది.
– కలెక్టర్ ఇలా త్రిపాఠి
పోటీ చేసిన వారు 45 రోజుల్లో ఖర్చుల లెక్క చెప్పాల్సిందే
ఫ 2019 ఎన్నికల్లో లెక్కలు ఇవ్వని 381 మంది సర్పంచ్ అభ్యర్థులపై వేటు
ఫ మూడేళ్ల పాటు ఏ పదవికీ పోటీ చేయకుండా అనర్హత
ఫ 586 మంది వార్డు సభ్యులనూ అనర్హులుగా ప్రకటించిన ఎన్నికల సంఘం
ఫ మరో 3,372 మంది ఓడిన అభ్యర్థులపైనా చర్యలు
ఫ లెక్కలు జాగ్రత్తగా ఇవ్వాలంటున్న అధికారులు
2019లో అనర్హత వేటు పడిన వారి వివరాలు..
మండలం సర్పంచ్ వార్డు వార్డుల్లో
అభ్యర్థులు సభ్యులు ఓడినవారు
చండూరు 26 69 171
చింతపల్లి 17 29 154
దేవరకొండ 14 71 124
గుండ్లపల్లి 17 78 168
గుర్రంపోడు 20 118 226
కేతేపల్లి 8 2 78
కొండమల్లేపల్లి 6 36 92
మర్రిగూడ 7 40 148
మిర్యాలగూడ 14 34 220
మునుగోడు 23 30 210
నకిరేకల్ 4 7 9
నల్లగొండ 30 2 252
నార్కట్‌పల్లి 27 18 221
పీఏపల్లి 22 18 192
తిప్పర్తి 18 32 167
వేములపల్లి 1 2 59
అడవిదేవులపల్లి 12 0 0
దామరచర్ల 17 0 149
కనగల్ 35 0 185
కట్టంగూర్ 13 0 167
నాంపల్లి 9 0 89
నిడమనూరు 13 0 124
పెద్దవూర 28 0 167


