ఆటలకొచ్చి.. అలమటించి!
ఫ దివ్యాంగ క్రీడాకారుల కడుపుమాడ్చిన క్రీడాపోటీల నిర్వాహకులు
ఫ సగం మందికే మధ్యాహ్న భోజనం
ఫ అధికారుల తీరుపై దివ్యాంగ క్రీడాకారుల ఆగ్రహం
నల్లగొండ టూటౌన్ : క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన దివ్యాంగ క్రీడాకారులు ఆకలితో అల్లాడారు. ఇటీవల పీఎం శ్రీ క్రీడల్లోనూ క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం పెట్టలేదని ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో దివ్యాంగుల క్రీడా పోటీల్లోనూ క్రీడాకారులకు మంగళవారం సరిపడా భోజనం పెట్టడం లేదు. దీంతో దివ్యాంగ క్రీడాకారులు కడుపుమాడ్చుకోవాల్సి వచ్చింది.
మూడు రోజులుగా నిర్వహణ
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీ్త్ర, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే క్రీడలు సోమవారం ప్రారంభమయ్యాయి. క్రీడల్లో పాల్గొనే దివ్యాంగ క్రీడాకారులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సర్క్యూలర్ ఇచ్చింది. క్రీడల నిర్వహణకు రూ.లక్ష విడుదల చేసింది. కానీ.. మొదటి రోజులు క్రీడాకారులకు టిఫిన్ పెట్టలేదు. ఇక రెండవ రోజైన మంగళవారం మధ్యాహ్న భోజనం సరిపడా అందించలేదు. క్రీడల్లో పాల్గొన్న దివ్యాంగులకు కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదని పలువురు మండిపడ్డారు.
సగం మందికి భోజనం లేదు
క్రీడా పోటీలకు ఎంత మంది దివ్యాంగులు హాజరవుతారనే అంచనా సంబంధిత అధికారులకు తెలిసే ఉంటుంది. పొంతన లేని లెక్కలు.. సాకులు చెబుతూ దివ్యాంగులన్న కనికరం కూడా లేకుండా వారికి సరిపడా భోజనం సమకూర్చకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రీడల్లో పాల్గొన్న సగం మంది దివ్యాంగ క్రీడాకారులు మధ్యాహ్నం భోజనం లేక కడుపు మాడ్చుకోవల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తాము అర్ధాకలితో అలమటించాల్సి వచ్చిందని పలువురు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు వినిపించాయి.
ఆటలకొచ్చి.. అలమటించి!
ఆటలకొచ్చి.. అలమటించి!


