రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ –16 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక ఈనెల 4వ తేదీన నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించబడునని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనొద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న జట్లతో లీగ్ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనభర్చిన వారిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. 01–09–2009 నుంచి 31–08–2011 మధ్య జన్మించిన వారు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9885717996, 6303430756 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
వరి కొయ్యలను కాల్చితే నేలకు హాని
రామగిరి(నల్లగొండ) : వరి కొయ్యలు కాల్చడం వల్ల నేలకు, వాతావరణానికి హాని కలుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. నారుమడి యాజమాన్యం, వరి కొయ్యలు కాల్చడం వల్ల కలిగే నష్టాలపై నల్లగొండ మండలంలోని అన్నారెడ్డిగూడెంలో మంగళవారం ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కంటే తగ్గినప్పుడు వరి నారు ఎర్రబడి చనిపోతుందన్నారు. దీన్ని అధిగమించేందుకు కోళ్లు, గొర్రెల ఎరువు, వర్మీ కంపోస్ట్ వేసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో నారుమడిపై పాలిథిన్ షీటు పరచాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
నల్లగొండ టౌన్: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖలో బీసీ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం సలహాదారులు వాడపల్లి సాయిబాబా, నల్ల సోమమల్లయ్య, లక్ష్మీ, నవీన్, వేణు, నరేష్, సత్యనారాయణ, ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆంజనేయస్వామికి ఆకుపూజ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో ఉన్న శ్రీఆంజనేయ స్వామికి మన్యసూక్త పారాయణంతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన హనుమంతుడికి సుగంధం వెదజల్లే పూల మాలలతో అలంకరించి నాగవల్లి దళార్చన జరిపించారు.
రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక


