సర్పంచ్‌కు 2,057.. వార్డులకు 5,908
ముగిసిన రెండవ విడత నామినేషన్ల పర్వం
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఫ చివరి రోజు నామినేషన్ కేంద్రాల వద్ద ఆశావహుల బారులు
ఫ క్లస్టర్లలో రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు
మిర్యాలగూడ : గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్లు శనివారం ముగిశాయి. చివరి రోజు ఆశావహులు జోరుగా నామినేషన్లు వేశారు. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లోని పది మండలాల్లో 282 సర్పంచ్, 2,418 వార్డులకు గాను నామినేషన్ల స్వీకరణను నవంబర్ 30వ తేదీన ప్రారంభించారు. మూడు రోజుల్లో 282 సర్పంచ్ స్థానాలకు 2,057, 2418 వార్డు సభ్యులకు 5,908 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్లు పరిశీలించనున్నారు. డిసెంబరు 14వ తేదీన పోలింగ్ జరగనుంది.
తొలి రెండు రోజుల్లో తక్కువగానే..
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 282 పంచాయతీల్లో ఎన్నిక నిర్వహణకు నవంబర్ 30వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన క్లస్టర్లలో 27వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించగా.. సర్పంచ్ స్థానాలకు మొదటిరోజు 166 మంది నామినేషన్ సమర్పించగా, రెండో రోజు ఆదివారం 591 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 2418 వార్డులకు మొదటి రోజు 156, రెండో రోజు 1211 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
రాత్రి వరకు నామినేషన్లు
క్లస్టర్లలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు ర్యాలీలతో నామినేషన్లు వేసేందుకు ఆయా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వారిని అధికారులు వంద మీటర్ల దూరంలోనే నిలిపివేశారు. నామినేషన్ కేంద్రాల్లోకి అభ్యర్థితోపాటు ఇద్దరిని అనుమతించారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటూ నామినేషన్ల దాఖలు ప్రక్రియ నిర్వహించగా.. చివరి రోజు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నామినేషన్ల దాఖలు చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో ఉన్న వారి నుంచి నామినేషన్లు తీసుకున్నారు.


