నాగార్జునసాగర్ : సాగర్ జలాశయానికి ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే కృష్ణమ్మ తరలివస్తోంది. ఈ ఏడాది కృష్ణానదికి ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణానదిలో వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి నీటి రాక పెరగడంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయి చేరువలో ఉంది. దీంతో మంగళవారం (8న) శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శ్రీశైలం గేట్లెత్తితే ఆ నీరంతా నాగార్జునసాగర్ జలాశయానికి చేరుకోనుంది.
ఎగువ ప్రాజెక్టుల్లో జలకళ
కృష్ణానదిపైన కర్నాటక, మహారాష్ట్రలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే దీంతో అదనంగా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎగువన గల జూరాల జలాశయం ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలకు గరిష్ట స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జూన్‌లోనే రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరడంతో మూడు రోజుల క్రితమే రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తారు. దీంతో ఇటు జూరాల, అటు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 885.00అడుగులు (215.807 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 879.30అడుగులు (184.2774 టీఎంసీలు)గా ఉంది. ఇప్పటికే శ్రీశైలం కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 67,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం పెరుగుతోంది. సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 527.00 అడుగులు (162.3490 టీఎంసీలు)గా ఉంది.
ఫ ఎగువన భారీగా వరద నీటి ప్రవాహం
ఫ రేపు శ్రీశైలం క్రస్ట్ గేట్ల ఎత్తివేతకు సిద్ధమైన అధికారులు
ఫ సాగర్ జలాశయంలో పెరగనున్న నీటిమట్టం
జూన్ 12 నుంచే నీటి రాక..
సాగర్ కనీస నీటిమట్టం 510.00 అడుగులు. కాగా గతేడాది ఇదే రోజున కనీస నీటిమట్టానికి దిగువన 503.80అడుగులు (120.8990 టీఎంసీలకు)గా ఉంది. జూలై 24 వరకు అలాగే కొనసాగింది. 25వ తేదీ నుంచి శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదన ద్వారా నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెడరగడంతో జూలై 29వ తేదీన శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేశారు. ఆగస్టు 5వ తేదీన సాగర్ జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లెత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ ఏడాది సాగర్ జలాశయం కనీస నీటిమట్టానికి వెళ్లలేదు. 511 అడుగుల వద్ద ఆగింది. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచే శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ వచ్చారు. క్రమంగా సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ఇదే రీతిలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే ముందస్తుగానే క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది.