
రేషన్ తీసుకోని కార్డులు కట్!
నల్లగొండ : రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోని కార్డులు రద్దు కానున్నాయి. అలాంటి కార్డుల గుర్తింపునకు అధికారులు కసరత్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 5092 కార్డులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. దీంతో ఆయా కార్డులను ప్రభుత్వం రద్దు చేయనుంది.
జిల్లాలో 4,78,216 రేషన్‌కార్డులు
జిల్లాలో 4,78,216 రేషన్‌కార్డులున్నాయి. ఆయా కార్డుల్లోని ప్రతి యూనిట్‌కు ప్రభుత్వం నెలకు ఆరు కిలలో చొప్పున బియ్యం అందిస్తోంది. గత నెలలో మూడు (జూన్, జూలై, ఆగస్టు) నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇచ్చింది. ఈ కోటాను కూడా చాలామంది తీసుకోలేదు. వారికి కార్డులు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. దీంతో పౌర సరఫరాల శాఖ ఆయా జిల్లాల్లో వరుసగా ఆరు మాసాలు రేషన్ తీసుకోని వారి వివరాలను జిల్లాలకు పంపింది. ఆ జాబితాను జిల్లా పౌర సరఫరాల అధికారులు తహసీల్దార్లకు పంపి విచారించాలని సూచించారు. దీంతో వారు ఆయా కుటుంబాల వద్దకు వెళ్లి విచారించారు. ఇందులో కొందరు చనిపోయినవారు, కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఉన్నారు. 5092 కార్డుదారులు ఆరు మాసాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేల్చి నివేదిక ఇచ్చారు.
అనర్హులకు రేషన్ అందవద్దని..
అనర్హులకు రేషన్ కార్డులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం బియ్యం తీసుకోని వివరాలను సేకరించింది. గతంలో కొందరు తప్పుడు పద్ధతిలో కార్డులు పొంది బియ్యం తీసుకునేవారు.. వేరే ప్రాంతానికి వెళ్లినవారు, చనిపోయిన వారిపేరున కూడా బియ్యం పొందేవారు. దీంతో ఐరిష్ లేదా వేలిముద్ర ఉండాలని ప్రభుత్వం నిర్ణయించడంతో చాలామంది బియ్యం తీసుకోలేదు. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించి కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫ ఆరు నెలలపాటు బియ్యం తీసుకోని రేషన్‌కార్డుల రద్దుకు ప్రభుత్వ నిర్ణయం
ఫ జిల్లాలో 5,092 కార్డులు ఉన్నట్లు తేల్చిన అధికారులు