
ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు
రామగిరి(నల్లగొండ) : వచ్చే మూడున్నర ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు వేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో రూ.6 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయాన్ని బుధవారం ఆయన జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు నెలలో రూ.3 వేల కోట్లతో 10 ప్యాకేజీలకు టెండర్లు పిలుస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి రూ.1200 కోట్లు ఖర్చు చేశామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా ఆర్‌అండ్‌బీ శాఖలో కొత్తగా ఏఈ పోస్టుల భర్తీ చేశామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత స్వయంశక్తితో ఎదిగేందుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు బాలునాయక్, మందుల సామేల్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి