
కమలం చీఫ్ మనోడే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో ఆయనొక్కరే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మంగళవారం ఆయన ఎన్నిక లాంఛనేమే కావడంతో జిల్లాలోని ఆయన బంధువులు, కోదాడ ప్రాంతంతోపాటు జిల్లా బీజేపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో స్థిర నివాసం
రాంచందర్‌రావు తల్లిదండ్రులు కోదాడ ప్రాంతానికి చెందిన వారే. తండ్రి ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ లక్ష్మీనారాయణరావు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందినవారే. లక్ష్మీనారాయణరావు బాల్యం ఇక్కడే గడిచింది. ఉన్నత విద్యాభ్యాసం తరువాత ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. రాంచందర్‌రావు చిన్నతనంలోనే తండ్రి లక్ష్మీనారాయణరావు, తల్లి రాఘవసీతమ్మ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీంతో రాంచందర్‌రావు బాల్యం, చదువు అంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న సమయంలో నల్లబండగూడెంలో వారి కుటుంబం నివసించిన ఇల్లు ప్రస్తుత శిథిలావస్థకు చేరుకుంది. రాంచందర్‌రావు అమ్మమ్మ ఊరు కూడా కోదాడ పక్కనే ఉన్న అనంతగిరి మండల కేంద్రమే. అక్కడ రాంచందర్‌రావు తరఫు బంధువులు ఉన్నారు.
కుటుంబంలో
పెద్దవాడు
మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు ఇద్దరు సోదరులు. వారిలో పెద్ద తమ్ముడు ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు. ఆయన జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌గా, వరంగల్ ఎన్‌ఐటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాయపూర్ ఎన్‌ఐటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఐటీకి ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రెండో తమ్ముడు హేమచందర్ అమెరికాలో స్ధిరపడ్డాడు. రాంచందర్‌రావు బాబాయి కుమారుడు రాఘవరావు కోదాడలో చిన్న పిల్లల వైద్యశాలను నిర్వహిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రాంచందర్‌రావు
ఫ ఆయన సొంతూరు కోదాడ మండలం నల్లబండగూడెం
అంచెలంచెలుగా ఎదిగిన రాంచందర్‌రావు
రాంచందర్‌రావు విద్యార్థి దశనుండే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించిన ఆయన 1980–85 కాలంలో యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. న్యాయ విద్య పూర్తయిన తరువాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే బీజేపీ నాయకుడిగా ఎదిగారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కాబోతున్నారు. ఆయనకు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో మంచి వక్తగా పేరుపొందారు. ఇప్పటికీ కోదాడ ప్రాంతంలో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆయన తరచుగా హజరవుతుంటారు.