
‘కస్తూరిబా’లో ప్రవేశాల జోరు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలంటే తల్లిదండ్రులు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ప్రశ్నార్థకమేనా? అనే పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కానీ అందుకు బిన్నంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు మాత్రం రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆ పాఠశాలలు విద్యార్థులతో నిండపోతుండటంతో అక్కడ అడ్మిషన్ కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందే. పాఠశాలలు ప్రారంభమైన మూడు రోజులకే అడ్మిషన్లు పూర్తవ్వడంతో అధికారులు అడ్మిషన్లు పుల్..అడ్మిషన్లు లేవు అని బోర్డు పెడుతున్నారంటే కేజీబీవీ పాఠశాలలకు ఏ స్థాయిలో ఆదరణ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ పాఠశాలలో అడ్మిషన్ మాదిరిగా ఇక్కడ పేరున్న నాయకులతో పైరవీలు చేయిస్తున్నా సీటు మాత్రం దొరకట్లేదు. ప్రభుత్వం తరగతికి 40మంది విద్యార్థులే అని పరిమితి విధించడంతో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది.
ఆంగ్లమాధ్యమంలో బోధన
తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 265 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐదు కొత్త మండలు తిరుమలగిరి(సాగర్), నేరేడుగొమ్ము, మల్లేపల్లి, మాడుగులపల్లి, అడవిదేవులపల్లి మండలాల్లోని పాఠశాలల్లో పూరి ్తస్థాయిలో ఆంగ్లమాధ్యమంలో బోధన అందిస్తున్నారు. జిల్లాలోని మిగతా 22 పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లమాధ్యమంలో బోధన కొనసాగుతుంది. దీంతో ఈ పాఠశాలలకు బాగా డిమాండ్ పెరిగింది. పదో తరగతి ఫలితాల్లో కూడా వందశాతం ఉత్తీర్ణతతో పాటు, ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో కస్తూరిబా గాంధీ విద్యాలయాలకు విద్యార్థులు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు.
నాణ్యమైన పౌష్టికాహారం
పేద విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం మెస్ చార్జీల కింద రూ. 1225 చెల్లిస్తుండగా, ఈ ఏడాది రూ. 1740 చొప్పున చెల్లిస్తుంది. నెలకు రెండుసార్లు మాంసం, ఐదు సార్లు చికెన్, వారం రోజులు గుడ్లు, శాఖహారులకు మిల్‌మేకర్ అందిస్తున్నారు. రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు.
నమ్మకంతోనే ఆదరణ
ఉత్తమ ఫలితాలు రావ డం, సక్రమంగా మెనూ ను అందిస్తుండటంతో కేజీబీవీ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. దీనికి తోడు ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. సీట్లు పూర్తయినా విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం వస్తుండటంతో అయిపోయినట్లు బోర్డు పెట్టాం. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తున్నాం.
– కవిత, ఎస్‌ఓ, తిరుమలగిరి కేజీబీవీ
తిరుమలగిరి కేజీబీవీలో
నో అడ్మిషన్ బోర్డు
కొన్నేళ్లుగా ‘పది’లో ఉత్తమ
ఫలితాలు సాధన
పూర్తిస్థాయిలో ఆంగ్ల బోధన
అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల పైరవీలు

‘కస్తూరిబా’లో ప్రవేశాల జోరు