
జనగణనకు సన్నద్ధం
నల్లగొండ: జనగణనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 మార్చి ఒకటి నాటికి రెండు దశల్లో జిల్లాలో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలి దశలో ఇళ్ల జాబితాను వెలువరించి రెండో దశలో జనగణన చేపట్టనున్నారు. చివరగా 2011లో దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టారు. మరలా 2021లో నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా జనగణన చేపట్టలేదు. దీంతో పదేళ్లకు ఒకసారి చేపట్టాల్సిన జనగణన ప్రక్రియ నాలుగేళ్లు ఆలస్యమైంది. జనగణన చేపట్టేందుకు ఇటీవల ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం జనగణనకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈసారి జనగణనతోపాటే కులగణన, జాతీయ పౌర పట్టిక (నేషనల్ సివిల్ రిజిస్టర్) ఒకేసారి చేపట్టాలని నిర్ణయించింది.
కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ..
జనగణనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్‌ఓ, సీపీఓతో సహా రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో అధికారితో జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్ జనగణన అధికారిగా వ్యవహరిస్తే అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ సహాయకుడిగా ఉంటారు. ఎన్యుమరేటర్లను ఉపాధ్యాయులనే నియమిస్తారు. అయితే నియమించిన ఎన్యుమరేటర్లంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రశ్నావళి ఆధారంగా జనగణన చేపట్టనున్నారు.
వచ్చే ఏడాదే
ఎన్యుమరేటర్ల నియామకం
అయితే 2026లోనే ఎన్యుమరేటర్లను నియమించి వారికి శిక్షణనివ్వనున్నారు. 150 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున నియమించి శిక్షణ ఇవ్వనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమిస్తారు. వీరంతా మొదట వారికి అప్పగించిన గ్రామాల్లో ఇళ్లను గుర్తిస్తారు. వారి పరిధిలో ఎన్ని గృహాలున్నాయి. ఆ గృహాల్లో ఎన్ని కుటుంబాలు నివశిస్తున్నాయనేది పూర్తి డేటాను మొదట సేకరిస్తారు. ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి జనాభా వివరాలు సేకరిస్తారు.
2027 సంవత్సరంలో
పూర్తికానున్న ప్రక్రియ
2026లో ఎన్యుమరేటర్ల నియామకంతో పాటు జనగణన ఏ విధంగా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 2027 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇంటింటికీ వెళ్లి జనగణన నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి 12గంటలలోపు పుట్టిన వారిని లెక్కలోకి తీసుకుంటారు. ఆ తర్వాత జన్మించిన వారిని పరిగణనలోకి తీసుకోరు. మార్చి 1 వరకు జనగణన ప్రక్రియ ముగియనుంది. గతంలో నేరుగా ఇంటింటికి వెళ్లి మాన్యువల్‌గా జనగణన చేపట్టగా ఈసారి జనగణన వివరాలు మొత్తం మొబైల్ యాప్‌లో నమోదు చేయనున్నారు.
ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఫ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి
కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు
ఫ రెండు దశల్లో కొనసాగనున్న ప్రక్రియ
ఫ తొలి విడతలో ఇళ్ల జాబితా గుర్తింపు
ఫ మలి దశలో జనాభా వివరాల సేకరణ
ఫ ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులు
జిల్లా వివరాలు ఇలా..
భౌగోళిక విస్తీర్ణం 7,128 కి.మీ.
రెవెన్యూ గ్రామాలు 566
మండలాలు 33
మున్సిపాలిటీలు 08
పంచాయతీలు 869
జనాభా
(2011లెక్కల ప్రకారం) 16,18,416
పురుషులు 8,18,306
మహిళలు 8,00,110
కుటుంబాలు 4,01,728