
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఇండస్ట్రీయల్ పార్కు వెనుక శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 42 నుంచి 45 ఏళ్ల మధ్యన ఉంటుందని, అతడి కుడి చేతిపై అనుశ్రీ అని పచ్చబొట్టు ఉందని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు వడదెబ్బతో లేదా ఇతర అనారోగ్యంతో మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేసినట్లు తెలిసింది. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
రాజాపేట: కడుపునొప్పితో బాధపడుతూ పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ ఘటన రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. చల్లూరు గ్రామానికి చెందిన గుంటి అశోక్(47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ అతడు చికిత్స చేయించుకుంటున్నాడు. ఈ నెల 9వ తేదీ ఉదయం అశోక్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో భార్య మాధవి ఫోన్ చేయగా అశోక్ ఫోన్ ఎత్తలేదు. దీంతో ఆమె వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూసేసరికి అశోక్ పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో కనిపించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చి అశోక్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పకి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మైసయ్య తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
భూ తగాదాలతో
వ్యక్తిపై గొడ్డలితో దాడి
తాళ్లగడ్డ (సూర్యాపేట): భూ తగాదాలతో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మంపహాడ్‌లో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్ల ఖమ్మపహాడ్ గ్రామానికి చెందిన మిర్యాల శేఖర్‌రెడ్డి(47) గ్రామంలో తనకున్న ఒక గుంట స్థలంలో చెట్లను కొట్టేసి చదును చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఎస్‌కే గౌస్, ఎస్‌కే సమీర్, ఎస్‌కే మైమూద్, ఎస్‌కే మల్సూర్, ఎస్‌కే అమీరా, ఎస్‌కే మున్నాభి పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మిర్యాల శేఖర్‌రెడ్డిపై గొడ్డలి, మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శేఖర్‌రెడ్డిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి మిర్యాల అమృతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ ఎన్. బాలునాయక్ తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం