
లక్ష్యాన్ని మించి.. రుణం
పొదుపు సంఘాలకు 105 శాతం బ్యాంకు లింకేజీ రుణాలు
నల్లగొండ : మహిళల ఆర్థికాబివృద్ధికి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రుణాలు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటాయి. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏటా రుణాలు ఇవ్వడంలో లక్ష్యాన్ని నిర్ణయ్తింది. 2024–25 సంవత్సరంలో రుణాల మంజూరులో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఇటీవల జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు అవార్డు అందుకున్నారు.
రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు..
స్వయం సహాయక మహిళా సంఘాలకు సెర్ప్ అధికారులు, సిబ్బంది ఆయా సంఘాల అర్హతను బట్టి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు మంజూరు చేశారు. సభ్యులకు సంఘాల తీర్మాణంతో రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు సైతం ఇచ్చారు. ఈ రుణంతో మహిళలు కిరాణా, వస్త్ర, స్టేషనరీ, పిండి గిర్నిలు, ఎంబ్రాయిడరీ, స్వీట్ల తయారీ తదితర దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా మహిళలంతా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ రుణాలు దోహదపడుతున్నాయి.
జిల్లాలో 22,937 మహిళా సంఘాలు
జిల్లాలోని 32 మండలాల పరిధిలో మొత్తం 22,937 సంఘాలు ఉండగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1094 కోట్ల రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సగానికి పైగా సంఘాలకు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ రుణాలు పొందాయి. అన్ని సంఘాలకు కలిపి రూ.1150 కోట్లు రుణాలు అందించారు. దీంతో 105.23 శాతం రుణాలను మహిళా సంఘాలకు అందించగలిగారు.
సిబ్బంది సమష్టి కృషి
నల్లగొండ జిల్లా డీఆర్‌డీఏ అధికారులు బ్యాంకు లింకేజీలో లక్ష్యానికి మించి రుణాలు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించింది. ఇటీవల జరిగిన కార్యక్రమంలో బ్యాంకు లింకేజీ కింద రుణాలు అధికంగా ఇచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహించినందుకు ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చింది. డీఆర్‌డీఏ సిబ్బంది అంతా కలిసికట్టుగా పని చేయడం వల్లే అవార్డును సాధించగలిగామని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి పేర్కొంటున్నారు.
ఫ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాకు మొదటిస్థానం
ఫ మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్న డీఆర్‌డీఓ
ఫ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న రుణం

లక్ష్యాన్ని మించి.. రుణం