
విత్తన సరఫరాలో డీలర్ల పాత్ర కీలకం
రామగిరి(నల్లగొండ) : రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ప్రధానమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడరాఉ. విత్తనం విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురి చేయవద్దన్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు రైతులకు ఇచ్చే విత్తనాలను అవసరమైతే వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో తనిఖీ చేయించుకోవాలని సూచించారు. దుకాణం ముందు ఎమ్మార్పీ ధరలకు విత్తనాలను అమ్మే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. కోరమండల్ కంపెనీ టెక్నికల్ స్టాఫ్‌ను పెంచాలని, వారు అందజేసే ఈ –పాస్‌లో ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే అధిగమించే విధంగా కృషి చేయాలన్నారు. గడిచిన యాసంగి సీజన్‌లో 5.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 5.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ వచ్చే వానాకాలం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని.. అందుకు అనుగుణంగా విత్తనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతులమీదుగా వంద మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోరమండల్ కంపెనీ సీజీఎం వెంకటేశ్వర్లు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, రామ్మూర్తి, రవి, రాజేందర్, హర్ష తదితరులు పాల్గొన్నారు.