
వాన నీటిని ఒడిసి పడుతున్న రైతు
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చండూరు మండలానికి చెందిన రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి ప్రయత్నం అభినందనీయమే. తనకున్న భూమిలో ఆరేళ్ల కిందటే భూగర్భ జలాలను పెంపొందించేందుకు కందకాలు తవ్వించారు. నాలుగు ఎకరాల్లో ఫాం పాండ్‌లు, నీటిని నీటి గుంతలు తవ్వించారు. ఎండలు మండుతున్నా ఆయన వ్యవసాయ క్షేత్రంలో నీటి నిల్వలు అలాగే ఉన్నాయి. ఆ నీటితోనే వ్యవసాయ క్షేత్రంలో మామిడి, సపోట, కొబ్బరి, సీతాఫలం, నిమ్మ తోటలు, జొన్న చేను సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా టమాట, కర్బూజ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ వంటివి పండిస్తున్నారు. అంతేకాదు వేప, జామాయిల్, కానుగ చెట్లను సైతం పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రం అంతా పచ్చదనంతో నిండిపోయింది.