సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం

May 12 2025 1:05 AM | Updated on May 12 2025 6:51 AM

సైన్య

సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం

పాకిస్తాన్‌తో తాడో పేడో తేల్చుకోవాలి

– నర్సింగ్‌ మార్క్‌, మాజీ సైనికుడు

నల్లగొండ : పాకిస్తాన్‌ మొదటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడటం భారత దళాలు వారికి బుద్ధి చెప్పడం, తోక ముడిచి వెనుదిరగడం పాకిస్తాన్‌కు అలవాటే. పాకిస్తాన్‌తో ఇప్పటికై నా తాడోపేడో తేల్చుకోవాలని అంటున్నారు మాజీ సైనికుడు, సెక్షన్‌ కమాండర్‌ నర్సింగ్‌ మార్క్‌. తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన నర్సింగ్‌ మార్క్‌ 1984లో ఆర్మీలోకి వెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని సావ్‌గర్‌లో ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకుని జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హైదరాబాద్‌, నేపాల్‌, కేరళ తదితర ప్రాంతాల్లో పని పని చేశారు. 2004లో రిటైర్‌ అయ్యారు.

శత్రువు మీద గురి పెట్టడమే లక్ష్యం..

చేతిలో తుపాకి ఎదురుగా ఉన్న శత్రువు మీద గురిపెట్టడం ఒకటే లక్ష్యంగా సైనికులు పోరాడుతారు. సైనికుడు లక్ష్యాన్ని చేధించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడు. పోరాడి వీరమరణం పొందుతాడే తప్ప శత్రువు చేతికి చిక్కే పరిస్థితి తెచ్చుకోరు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే యుద్ధంలో ‘జవాన్‌కు ఆఖరి గోలి ఆఖరి దుష్మన్‌’ అనే విధానం ఆఖరి తూటాతో శత్రువును నాశనం చేయడం.. అవకాశం లేకపోతే శత్రువుల చేతిలో చంపకుండా తనకు తానే కాల్చుకుని వీరమరణం పొందుతాడు తప్ప వెన్ను చూపడు. ఆ విధంగా ప్రతి సైనికుడు యుద్ధంలో పోరాడుతాడు.

కార్గిల్‌ యుద్ధంలో సెక్షన్‌ కమాండర్‌గా

పని చేశా..

1999లో జరిగిన కార్గిల్‌ యుద్దంలో నేను సెక్షన్‌ కమాండర్‌గా పని చేశా. హిమాలయాల్లో టైగర్‌ హిల్స్‌పై ఆరు నెలలు ఉన్నాం. మంచు పర్వతమిది. మంచినీళ్లు కూడా ఉండవు. మంచుని కరిగించుకుని తాగాలి. వంట చేసుకోవాలన్న అక్కడ ఉన్న మంచుగడ్డలను గిన్నెలో వేసి నీరుగా మార్చిన తర్వాతే వంట చేసుకోవాలి. ఒక్కోసారి తిండి లేకున్నా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ టైగర్‌ హిల్స్‌పై పైకి ఒకసారి వెళ్లామంటే ఆరు నెలలకు అవసరమైన అన్ని అహార పదార్థాలు, మెడిసిన్‌ తీసుకెళ్లాలి. అత్యవసరమైతే పైనుంచి హెలికాప్టర్‌లో వచ్చి పైనుంచి కిందకు వదులుతారు. సమాచార వ్యవస్థ కూడా అసలు ఉండదు. కార్గిల్‌ యుద్ధంలో శత్రువులు మా వైపు రాకుండా ముందే మైన్‌ ఎం14, ఎం16లను భూమిలో పాతిపెట్టేవాళ్లం. వెంట్రుక లాంటి వైర్లును అమర్చాం. అయితే శత్రువులు అటుగా ఆ మైన్లను దాటి వస్తే ఆ వైర్‌కు కాలు తగిలినా.. మైన్‌ మీద కాలు పెట్టినా అది పేలిపోతుంది. అలా శత్రువుల ఆట కట్టంచే వాళ్లం.

మళ్లీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధం

పాకిస్తాన్‌తో మళ్లీ యుద్ధం జరిగిన సమయంలో.. నన్ను పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. నేను ట్రెయిన్డ్‌ జవాన్‌ను. ఎప్పుడైనా దేశం రక్షణ కోసం జరిగే యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంటాను. మాతో పాటు చాలా మంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారు.

దేశసేవ చేయడం అదృష్టం

– లక్క లింగారెడ్డి, మాజీ సైనికుడు

పెద్దవూర : దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాలి. అది అందరికీ రాదు అని చెబుతున్నారు ఇండియన్‌ ఆర్మీలో 19 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన లక్క లింగారెడ్డి. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన లింగారెడ్డి. తల్లింద్రులకు ఒక్క కుమారుడు. ఆర్మీలో చేరవద్దని తల్లిదండ్రులు ఎంత వద్దని వారించినా దేశానికి సేవ చేయాలన్న తలంపుతో 2003లో ఆర్మీలో చేరారు. 2022 డిసెంబర్‌లో రిటైర్‌ అయ్యారు.

19 ఏళ్లు సైన్యంలో పనిచేశా..

ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌(ఏఏడీ)లో ట్రైనింగ్‌ చేసి 47 ఎయిర్‌ డిఫెన్స్‌ రెజిమెంట్‌లో పోస్టింగ్‌కు వెళ్లా. తన సర్వీసులో ఆరున్నర సంవత్సరాలు జమ్మూ కశ్మీర్‌లో పనిచేశా. మూడు సంవత్సరాలు ఉగ్రవాదులను ఏరివేసే స్పెషల్‌ బెటాలియన్‌ రాష్ట్రీయ రైఫిల్స్‌(25 రాష్ట్రీయ రైఫిల్స్‌)లో పనిచేశా. ఆ సమయంలో ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నా. 19ఏళ్లు సైన్యంలో పని చేసి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వచ్చిన సమయంలో గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు రెండు కిలోమీటర్ల వరకు ఎదురొచ్చి కుంకుమ దిద్ది, హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. రెండు కిలోమీటర్లు పూలు చల్లుతూ బాణాసంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఆ అనుభూతిని నేను జీవితంలో మరిచిపోలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్‌ ఆర్మీ ధైర్యంగా, విరోచితంగా, సాంకేతికతతో పోరాడుతోంది. యుద్ధం వల్ల దేశానికి కొంత నష్టం జరిగినా భవిష్యత్‌లో ఉగ్రవాద సంఘటనలు జరగకుండా ఉంటాయి. యుద్ధ సమయంలో తన అవసరం ఉందని సైన్యం పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు కాల్‌ వస్తుందా అని ఎదురుచూస్తున్నా.

దేశ సేవ చేసే అదృష్టం

అందరికీ రాదు

మాజీ సైనికులు నర్సింగ్‌ మార్క్‌, లక్క లింగారెడ్డి

‘ఆపరేషన్‌ సిందూర్‌తో భారత జవాన్లు గట్టిగా పోరాడుతున్నారు. ఎప్పుడు యుద్ధం జరిగినా సైన్యం పిలస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉంటాం. దేశరక్షణ కోసం ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తుంటాం. దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాం. అది అందరికీ రాదని చెబుతున్నారు’ మాజీ సైనికులు నర్సింగ్‌ మార్క్‌, లక్క లింగారెడ్డి. ఇండియా – పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారు ‘సాక్షి’తో మాట్లాడారు.

సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం1
1/1

సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement