
‘ఆదర్శ’లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు
సద్వినియోగం చేసుకోవాలి
ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా విద్యనిందిస్తుంది. క్రమశిక్షణతో పాటు అనుభవం కలి గిన అధ్యాపకులతో నాణ్య మైన బోధన ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– మమత, ప్రిన్సిపాల్,
ఆదర్శ పాఠశాల, కొర్లపహాడ్
● ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
● 20వ తేదీ వరకు గడువు
● ఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు
● ఒక్కో పాఠశాలకు 160 సీట్లు
కేతేపల్లి, తిరుమలగిరి: ఇంటర్మీడియట్ ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఆదర్శ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఉమ్మడి జిల్లాలో 31 పాఠశాలలు
ఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ఉండగా.. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామంలో మాత్రమే ఆదర్శ పాఠశాల ఉంది. ప్రతి పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేస్తారు. ఈ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తారు.
ఎంపిక ప్రక్రియ ఇలా...
పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ సిలబస్‌తో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్ కూడా ఇస్తారు.
బాలికలకు హాస్టల్ సౌకర్యం
ఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం ఉంది. హాస్టల్‌కు కనీసం మూడు కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండే గ్రామాల నుంచి వచ్చే వారు మాత్రమే హాస్టళ్లలో ఉండేందుకు అర్హులు. వీరి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్, నర్సును నియమించారు.

‘ఆదర్శ’లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు