నీలగిరి బడ్జెట్‌ రూ.784.86 కోట్లు

- - Sakshi

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపాలిటీ 2023–24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అంచనాలను మున్సిపల్‌ యంత్రాంగం తయారు చేసింది. ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్ను, భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రానున్న గ్రాంట్స్‌ కలుపుకొని మొత్తం రూ.784 కోట్ల 86 లక్షల 20 వేలుగా అంచనా వేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.7.1 కోట్లు, స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ – పట్టణ ప్రగతి ద్వారా రూ.7.1 కోట్లు, రోడ్డు గ్రాంట్స్‌ ద్వారా రూ.50 లక్షలు, ఎస్‌ఎఫ్‌సీ ద్వారా రూ.1.50 కోట్లు, స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ తెలంగాణ కింద రూ.2.50 కోట్లు, సీఎం భరోసా నిధులు రూ.294 కోట్లు, అమృత్‌ సిటీ కింద రూ.272 కోట్లు రానున్నట్లు ప్రతిపాదించారు. అదే విధంగా ఈ ఏడాదిలో వివిధ పన్నుల రూపంలో మున్సిపాలిటీకి రూ.60 కోట్ల 93 లక్షల 20 వేల సాధారణ ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. 2023 ఏప్రిల్‌ ఒకటిన ప్రారంభ నిల్వ రూ.10 కోట్ల 6 లక్షల 62 వేలు అని బడ్జెట్‌లో చూపించారు. మొత్తం సాధారణ ఆదాయం రూ.70 కోట్ల 99 లక్షల 82 వేలు కానుంది. అదే విధంగా 2024 ఏప్రిల్‌ ఒకటి నాటికి ప్రారంభం నిల్వ రూ.10 కోట్ల 10 లక్షల 67 వేలు ఉండనున్నట్లు అంచనా వేశారు. కాగా 2023–24 అంచనా క్యాపిటల్‌ ఆదాయం రూ.719.23 కోట్లుగా చూపించగా, క్యాపిటల్‌ వ్యయం రూ.539.63 కోట్లు.. డిపాజిట్లు, అప్పులు రూ.4.70 కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

పన్నుల ద్వారా రానున్న ప్రధాన నిధులు..

నీలగిరి మున్సిపాలిటీకి ఆస్తి పన్ను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, ఇతర పన్నుల ద్వారా 2023–24 సంవత్సరంలో రూ.27.91 కోట్లు ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. మున్సిపల్‌ దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి అద్దె ఈ మార్చి నెలాఖరులోగా రూ.3.98 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4.84 కోట్లు రానున్నట్లు లెక్కలు వేశారు. భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ.14 కోట్లు, ఇంజనీరింగ్‌ విభాగం నాన్‌ ట్యాక్సెస్‌ రూ.2 కోట్లు, ట్రేడ్‌ లైసెన్స్‌ పీజులు రూ.90 లక్షలు, అపరాధ రుసుంలు రూ.1.10 కోట్లు, లే అవుట్‌ పీజులు రూ.2.50 కోట్లు ప్రధానంగా రానున్నాయి. అదే విధంగా కుళాయిల ద్వారా రూ.4.20 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వీటితో పాటు టెండర్‌ షెడ్యూల్‌ ఫారాల అమ్మకం, పాత వార్త పత్రికల అమ్మకం, నీటి ట్యాంకర్ల యూజర్‌ చార్జీలు, కుళాయిల క్రమబద్ధీకరణ తదితర వాటి ద్వారా నిధులు సమకూరుతాయని అంచనాలు రూపొందించారు.

ప్రధాన ఖర్చులు ఇలా..

చివరి శ్రేణి ఉద్యోగుల వేతనాలు రూ.1.10 కోట్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు రూ.19.03 కోట్లు, పారిశుద్ధ్య ఖర్చులు రూ.35 లక్షలు, బ్లీచింగ్‌ పౌడర్‌ రూ.35 లక్షలు, పారిశుద్ధ్య కార్మికుల దుస్తులు, చెప్పులు, ఆయిల్‌ ఖర్చులు రూ.45 లక్షలు, వాహనాల ఇన్సూరెన్స్‌ రూ.35 లక్షలు, వీధి దీపాల విద్యుత్‌ నిర్వహణ ఖర్చులు రూ.2.52 కోట్లు, నీటి వినియోగ విద్యుతత్‌ నిర్వహణ చార్జీలు రూ.6.60 కోట్లుగా చూపించారు.

ఫ సాధారణ ఆదాయం రూ.60.93 కోట్లు

ఫ ఆస్తి పన్ను ద్వారా రూ.27.91 కోట్లు

ఫ అంచనా వేసిన మున్సిపల్‌ యంత్రాంగం

ఆదాయ వనరులకు దగ్గరగా అంచనాలు

మున్సిపాలిటీ ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ రూపొందించడం జరిగింది. ఆదాయ వనరులకు దగ్గరగానే అంచనాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రానున్న గ్రాంట్స్‌ను బడ్జెట్‌లో పెట్టాం. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉన్న వాటినే ప్రధానంగా పరిగణనలోకి తీసకున్నాం.

– రమణాచారి, మున్సిపల్‌ కమిషనర్‌

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top