
బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తోంది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అందులో స్థానిక ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలంతా పాల్గొనేలా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇవి ప్రారంభమయ్యాయి. ఆత్మీయ సమ్మేళనాలకు నల్లగొండ జిల్లా ఇన్‌చార్జీగా మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని పార్టీ నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ నియమితులయ్యారు. వీరితో పాటు పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సమ్మేళనాలు జరుగుతున్నాయి. సమ్మేళనాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నింటిని ప్రజలకు తెలియపర్చి ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
జన చైతన్యయాత్రలతో సీపీఎం..
కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా సీపీఎం జన చైతన్య యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మూడు బృందాలు యాత్రలను నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాయి. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో చైతన్య యాత్ర నిర్వహించాయి. మంగళవారం భువనగిరి జిల్లాలోనూ యాత్ర కొనసాగింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యాత్రల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈడీ , సీబీఐ ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందంటూ ప్రచారం చేయడంతోపాటు బీజేపీ మతత్వ విధానాలు ప్రజలకు ప్రమాదమంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ప్రచార జాతాకు సిద్ధమవుతున్న సీపీఐ
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఐ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 14 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ ప్రచార జాతాలు నిర్వహించనుంది. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ధరల పెరుగుదల, మతోన్మాదం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సిద్ధమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఏడాదే సాధారణ ఎన్నికలు ఉండటంతో అన్ని పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లోకి వెళ్తుండగా, కాంగ్రెస్ మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరిచే దిశగా ముందుకు సాగుతోంది. ఇక బీజేపీ.. టీఎస్‌పీఎస్సీ పేపరు లీకేజీ, లిక్కర్ స్కాం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది.
–సాక్షి ప్రతినిధి, నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ
టీఎస్‌పీఎస్సీ పేపరు లీకేజీ, లిక్కర్ స్కాం వంటి అంశాలు, రాష్ట్ర వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ప్రజల్లోకి వెళ్తోంది. ఇటీవలే స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల పేరుతో ప్రధాన కూడళ్లలో బీజేపీ సభలను నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు పేపర్ లీకేజీతో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. అందులో భాగంగా నిరసన కార్యక్రమాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తోంది.
ప్రజాక్షేత్రంలోకి ప్రధాన పార్టీలు
ఫ ఆత్మీయ సమ్మేళనాల్లో బీఆర్‌ఎస్
ఫ జోడో యాత్రలతో సాగిపోతున్న కాంగ్రెస్
ఫ ‘జన చైతన్యం’తో ఉమ్మడి జిల్లాను చుట్టేస్తున్న సీపీఎం
ఫ రాష్ట్ర సర్కార్ వైఫల్యాలపై
కమలం శ్రేణుల ఆందోళనలు
ఫ ఒక్కో పార్టీది ఒక్కో ఎజెండా
జోడో యాత్రతో కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై హాథ్‌సే హాథ్ జోడో యాత్రలు రాష్ట్ర పార్టీ నిర్వహిస్తోంది. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం జిల్లాలో పర్యటించకపోయినా ఈ ముగ్గురు సీనియర్ నేతల నేతృత్వంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాహుల్‌గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని కేంద్రం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేర కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణిపై ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర త్వరలో జిల్లాలోనూ కొనసాగనుంది.