శ్రీశైలం జలాశయానికి జలకళ | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం జలాశయానికి జలకళ

Jun 28 2025 5:30 AM | Updated on Jun 28 2025 7:41 AM

శ్రీశైలం జలాశయానికి జలకళ

శ్రీశైలం జలాశయానికి జలకళ

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఈసారి వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే కృష్ణానది నీటితో కళకళలాడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్ట్‌ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌ శరవేగంగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు శుక్రవారం నాటికి 125.1322 టీఎంసీలకు చేరింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈస్థాయి నీటిమట్టానికి చేరుకునే ఈ ప్రాజెక్టులోఈసారి జూన్‌ నెలలోనే జలాశయం సగానికి పైగా నిండటం విశేషం.

● వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ల నుంచి జూరాల జలాశయానికి నీటి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలలో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతున్నారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ కెనాల్‌, ఆర్డీఎస్‌ లింక్‌ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌ నుంచి దిగువకు 1.14 లక్షల వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 865.7 అడుగల ఎత్తుకు చేరుకుంది. ఇంకా వర్షాలతో పాటు వరద కొనసాగితే మరో 10–15 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జూన్‌ మాసంలోనే కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరగడంతో సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఈసారి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మొత్తం 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌ కింద 29వ ప్యాకేజీ విస్తరణ పనులు సైతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వస్తుండడంతో కేఎల్‌ఐ కింద ఆయకట్టుకు ముందస్తుగానే సాగునీరు అందించేందుకు వీలుంది. జూరాల ప్రాజెక్ట్‌ ఇప్పటికే నిండటంతో ప్రాజెక్ట్‌ ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది.

శ్రీశైలం జలాశయంలో పెరిగిన నీటి మట్టం

ఈసారి ముందుగానే ఆయకట్టుకు నీటి సరఫరా..

మూడు మోటార్లు సిద్ధంగా ఉన్నాయి..

ఈసారి ముందుగానే కృష్ణానదిలో నీటి ప్రవాహం అందుబాటులో ఉండటంతో కేఎల్‌ఐ ద్వారా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎల్లూరు వద్ద పంప్‌హౌస్‌లో మూడు మోటార్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

– శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ

మరమ్మతులు పూర్తయితేనే పూర్తిస్థాయి వినియోగం

కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేఎల్‌ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్‌ఐ ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లూర్‌ పంప్‌హౌస్‌లో మొత్తం ఐదు మోటార్లకు రెండు మోటార్లు రిపేర్‌లో ఉన్నాయి. 3వ, 5వ మోటార్లు గతంలోనే పాడవగా, వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. మోటార్ల రిపేరు పనులు కొనసాగుతున్నాయి. సీజన్‌ ప్రారంభం అయ్యే నాటికి మోటార్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. కేఎల్‌ఐ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతును పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్‌ఐ రిజర్వాయర్ల సామర్థ్యం టీఎంసీ కన్నా తక్కువగా ఉండటంతో ఎక్కువ నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ప్రతి వారం రోజులకు ఒకసారి మూడు రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్‌భగీరథ నీటి సరఫరాతో పాటు సాగునీటి సరఫరాకు మోటార్ల ద్వారా నిరంతరం నీటి ఎత్తిపోతలను కొనసాగించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement