
దేశానికే రోల్ మోడల్ తెలంగాణ
కల్వకుర్తి రూరల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లిలో రూ. 26కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులతో పెట్రోల్ బంక్‌లు, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, రైస్‌మిల్లులు తదితర వాటిని ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అదే విధంగా విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతుభరోసా పథకం ద్వారా రైతులకు సకాలంలో పంట పెట్టుబడి సాయం అందించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మా ట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి సహకారంతో దాదాపు రూ. 600కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. వచ్చేనెల 7న వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పొ ల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ జెడ్పీటీసీ అశోక్‌రెడ్డి, సంజీవ్ యాదవ్, విజయకుమార్‌రెడ్డి, ఆనంద్ కుమార్, లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, రాజేశ్‌రెడ్డి, పండిత్‌రావు, భూపతి రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సుదర్శన్‌రెడ్డి, బాలస్వామిగౌడ్ పాల్గొన్నారు.