
తీరని ‘కౌలు’ కష్టం!
అడియాశలుగానే మారిన ‘రైతుభరోసా’
●
ప్రభుత్వం ఆదుకోవాలి..
నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికి తోడు ఎకరాకు రూ. 8వేల చొప్పున మూడెకరాలను కౌలుకు తీసుకొని పత్తిసాగు చేస్తున్నా. కౌలు డబ్బులే కాకుండా పెట్టబడికి రూ.లక్ష వరకు ఖర్చు అవుతోంది. మొత్తంగా ఐదెకరాలకు రూ. 1.50 లక్షల పెట్టుబడి అవుతుంది. గతేడాది పంట దిగుబడి రాక రూ. 50వేలు నష్టపోయా. ప్రభుత్వం కౌలు రైతులకు సైతం భరోసా ఇచ్చి ఆదుకోవాలి. – నిమ్మల బాలింగయ్య,
జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్
పెట్టుబడులు పెరిగాయి..
13 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఒక పంటకు ఎకరా రూ. 10వేల చొప్పున 8 ఎకరాలు, మరో ఐదెకరాలు రూ. 8వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నా. ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామన్నా రైతుభరోసా అందించి ఆదుకోవాలి. పెట్టుబడి సాయం మాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలి.
– రాసమోల్ల శివ, తెలుగుపల్లి, అమ్రాబాద్
అచ్చంపేట: కౌలు రైతులకు సాగు కష్టాలు తీరడం లేదు. ఏటా కౌలు ధరలు పెరుగుతుండటం.. ప్రైవేటులో అప్పులు తెచ్చి సాగు చేయడం.. అష్టకష్టాలు పడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడటం పరిపాటిగా మారాయి. పంటల విక్రయం, ఎరువుల కొనుగోలుకు సైతం నానాయాతన పడక తప్పడం లేదు. గత ప్రభుత్వా ల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వారిపై కనికరం చూపడం లేదు. రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ రైతుభరోసా పథకం కింద సీజన్‌కు రూ. 12వేల చొప్పున అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను సైతం స్వీకరించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఊసెత్తడం లేదు. దీంతో కౌలు రైతుల ఆశలు అడియాశలుగానే మారాయి.
ఎకరా రూ.15వేల వరకు..
రెండేళ్ల క్రితం కౌలు ధరలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ ప్రస్తుతం కౌలు ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు కౌలు తీసుకుంటున్నారు. వీరికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చేయూత అందడం లేదు. కనీసం బ్యాంకుల్లో పంట రుణాలకు కూడా వీరు అర్హులు కాలేకపోతున్నారు. సాగు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వపరంగా అందించే సాయం పట్టాదారుల ఖాతాల్లోకి చేరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవాలన్నా పట్టాదారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నా పట్టాదారుల పేరుమీదే కొనుగోలు చేస్తున్నారు.
చివరి దాకా కష్టాలే..
కౌలు రైతుకు సాగు సీజన్ ప్రారంభం ఉంచి మొదలుకుని సీజన్ పూర్తయ్యే వరకు కష్టాలు వెన్నంటి ఉంటున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలోని ప్రతీది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఫలితంగా విత్తనాల కొనుగోలు నుంచి మొదలుకుని పంట అమ్మే వరకు పట్టాదారు పాస్‌పుస్తకం అవసరమవుతోంది. ఈ క్రమంలో కౌలురైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల జిరాక్స్ ఇచ్చేందుకు భూ యాజమానులు కొందరు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఎరువులు, విత్తనాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు.
విత్తన, ఎరువుల ధరలకు తోడు
పెరుగుతున్న కౌలు
పెట్టుబడుల కోసం
తప్పని ప్రైవేటు అప్పులు
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
జిల్లావ్యాప్తంగా 70వేల మందికి పైగానే..
జిల్లాలో 7,59,793 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతేడాది వానాకాలంలో 4,35,692 ఎకరాల్లో సాగుచేయగా.. ఈ ఏడాది 5,38,462 ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా. మొత్తం 3,22,724 మంది రైతులు ఉండగా.. వీరిలో 70వేల మందికి పైగా కౌలురైతులు ఉన్నారని వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. అయితే వీరిలో చాలా మంది తమకు ఉన్న ఎకరం, ఆరెకరం భూమితో పాటుగా మూడెకరాల నుంచి ఐదెకరాల వరకు కౌలుకు తీసుకొని పంటసాగు చేస్తున్నారు. వీరికి బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇవ్వక.. రైతుభరోసా అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టబడులకు ప్రైవేటు అప్పులపైనే ఆధారపడుతున్నారు.

తీరని ‘కౌలు’ కష్టం!

తీరని ‘కౌలు’ కష్టం!