
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
నాగర్‌కర్నూల్ క్రైం: మాదకద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసుశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి జిల్లా జడ్జి ప్రారంభించగా.. జిల్లా జనరల్ ఆస్పత్రి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు గ్రామస్థాయి వరకు వచ్చాయన్నారు. సమాజానికి ఒక చీడపురుగులా మాదకద్రవ్యాల వ్యవస్థ మారిందని.. వాటిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. వీటిని విక్రయించే వారి సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ వినియోగంతో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లాలో డ్రగ్స్ బారిన పడిన యువత కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో యు వత ముఖ్యభూమిక పోషించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
● ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా పోలీసుశాఖ సత్వర చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
యువత మత్తు పదార్థాలకు
దూరంగా ఉండాలి
జిల్లా జడ్జి రమాకాంత్