
ఏసీబీ నజర్!
కల్వకుర్తి టౌన్: అవినీతి అధికారులకు ఏసీబీ భయం పట్టుకుంది. బుధవారం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ–2 రాంచందర్‌జీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నేపథ్యంలో ఇతర శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని.. లంచం ఇవ్వకుంటే పనిచేయడం లేదని ప్రజలు బహిరంగంగా చెబుతు న్నారు. అయితే ఇటీవల పలు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ మేరకు పట్టణంలోని పలు కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెట్టిందని తెలిసింది. ముఖ్యంగా లబ్ధిదారులకు పథకాలను చేర్చడంలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ, మున్సిపల్ శాఖలపై అవినీతి ఆరోపణలు ఉండటంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
పలు శాఖల అధికారులపై
అవినీతి ఆరోపణలు
ప్రభుత్వ పథకాలు
అందించడంలోనూ చేతివాటం
ఏసీబీ దాడులతో
అవినీతిపరుల గుండెల్లో రైళ్లు