
సీజనల్ వ్యాధులతో జరభద్రం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లావ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల కారణంగా చలి గాలులు వీస్తుండడంతో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా ఇంటి పరిసరాలు, పాత టైర్లు, నీటి తొట్టిల్లో నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, వైరల్ ఫీవర్ తదితర వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ప్రణాళిక ప్రకారం..
వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దోమల వ్యాప్తి పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. గంబూషియా చేపలను సేకరించి గ్రామాల్లోని మురికి కుంటల్లో వదిలి దోమల వ్యాప్తిని అరికడుతున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.
జిల్లాలో నమోదయిన కేసులు
జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేటలో 2024 సంవత్సరంలో 89 డెంగ్యూ, 3 చికన్‌గున్యా, 4 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2025లో ఇప్పటి వరకు నలుగురు డెంగ్యూ బారిన పడగా.. చికన్‌గున్యా, మలేరియా కేసులు నమోదుకాలేదు.
డెంగీ, మలేరియా కేసులు పెరగకుండా పటిష్ట చర్యలు
అవగాహన కల్పిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ