
కొండారెడ్డిపల్లి అభివృద్ధిలో వేగం పెంచండి
వంగూరు: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కొండారెడ్డిపల్లిలోనే అంతర్గత విద్యుత్ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వంద శాతం సోలార్ విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శగ్రామంగా నిలపాలని కోరారు. ఫోర్‌లైన్స్ రోడ్డు, పాలశీతలీకరణ కేంద్రం పనులు పూర్తి చేయడంతో పాటు అండర్ డ్రెయినేజీ పనులు ప్రారంభించాలన్నారు.
నిధుల కొరత లేదు
కొండారెడ్డిపల్లితో పాటు అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సోదరుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి, వేమారెడ్డి, రాఘవేందర్, వంశీ, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారిగా దేవసహాయం
కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహాయాన్ని నియమించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఇక నుంచి గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.