
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు విద్యార్థుల ఎంపిక
నాగర్‌కర్నూల్: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేశారు. డీఈఓ ఎ.రమేశ్ కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి రాంలాల్‌తో కలిసి.. అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో నిర్దేశించిన తొమ్మిది ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో చేరేందుకు 88సీట్లు (నాన్ రెసిడెన్షియల్), ఐదో తరగతిలో 90 సీట్లు (రెసిడెన్షియల్) కేటాయించగా.. మొత్తం 422మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఎస్సీ కులాల వారీగా 33శాతం రిజర్వేషన్లు బాలికలకు కేటాయించగా, మిగిలిన సీట్లను జనరల్ కోటాలో లక్కీ డిప్ తీసినట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో ఎస్సీ సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ రాగమణి, కవిత, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.