
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
తాడూరు: ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ పిలుపునిచ్చారు. శనివారం తాడూరులో సీపీఐ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టారు. అనంతరం బాల్‌నర్సింహ పార్టీ జెండా ఎగురవేసి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మతఘర్షణలు పెరిగాయన్నారు. నల్లదనం వెలికితీత, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు, ధరల నియంత్రణ హామీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గాలికొదిలేసిందని అన్నారు. అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న చెంచులు, గిరిజనులను అక్కడి నుంచి ఖాళీ చేయించి.. ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగా ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టులను హతమారుస్తుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని.. ప్రజల పక్షాన సీపీఐ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు వార్ల వెంకటయ్య, శివశంకర్, భరత్, చంద్రమౌళి, రామకృష్ణ, కురుమూరి ఉన్నారు.