కందనూలు: జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల, రంగారెడ్డి షాద్‌నగర్ సమీపంలోని నూర్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న టీజీఎస్‌డబ్ల్యూఆర్డీసీ (ఉమెన్)లో బోధించుటకు అర్హులైన మహిళా అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోటనీ, స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీలో ఖాళీలు ఉన్నాయని, పీజీలో 55 శాతం మార్కులు, నెట్, సెట్ ఉత్తీర్ణులై మూడేళ్ల బోధనానుభవం ఉన్న వారు జూన్ 25వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 95029 63320, 77939 75030 సంప్రదించాలని సూచించారు.
ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సీపీఐ
పెద్దకొత్తపల్లి: ప్రజా సమస్యలపై పోరాడే ఏకై క పార్టీ సీపీఐ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శుక్రవారం మండలంలోని వెన్నచర్లలో జరిగిన పార్టీ మండల 18వ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వందేళ్లుగా ఓట్లు, సీట్లు, అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తున్నామన్నారు. దేశంలో రెండు దశబ్దాలు అధికారంలో ఉన్న పార్టీలు నేడు కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుందని.. ఓడిన పార్టీల నాయకులు అధికారం కోసం గెలిచిన పార్టీల్లో చేరుతూ అధికారాన్ని అస్వాదిస్తున్నారని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భూ స్వాములు, పెత్తందారుల కొమ్ము కాస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ ఫయాజ్, కార్యవర్గసభ్యుడు నర్సింహ, పెబ్బేటి విజయుడు, కార్యదర్శి బొల్లెందుల శ్రీనివాసులు, బండి లక్ష్మీపతి, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, మజీద్, రామచంద్రయ్య, వెంకటేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి’
నాగర్‌కర్నూల్ రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని.. బీసీలను అవమానించేందుకు చూస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్ ఆరోపించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల్లో రాజకీయ చైతన్యం వచ్చిందని.. అవమానకర రాజకీయాలు ఎవరు చేసినా బీసీ సమాజం తగిన బుద్ది చెబుతుందని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ
బిజినేపల్లి: సీజనల్ వ్యాధులతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. వెంకటదాస్ అన్నారు. శుక్రవారం ఉదయం పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడంతో పాటు దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డా. ప్రియాంక, వైద్య, ఆరోగ్య సిబ్బంది నర్సింహులు, బాదం రాజేశ్వర్, సుజాత, గజవర్దనమ్మ, విజయ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.