
ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం
నాగర్‌కర్నూల్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ, సీజనల్ వ్యాధులు, తెలంగాణ వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యాన పంటలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ, ప్రాజెక్టుల నిర్మాణానికి భూ సేకరణలో జాప్యం కాకుండా చూస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. అంటువ్యాధుల నివారణకు ముందస్తుగా మందుల నిల్వ, వైద్యబృందాల సన్నద్ధత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సామర్థ్యం పెంచే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని, నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వ్యవస్థాత్మకంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యాన పంటల సాగుపై కలెక్టర్ సమీక్షించారు. సాగు విస్తీర్ణం, రైతులకు అందుతున్న సాంకేతిక సాయం, మార్కెటింగ్, నీటి లభ్యతపై అధికారులతో చర్చించారు. రైతులకు ప్రోత్సాహకాల అమలుపై కూడా ఆరా తీశారు.
2,71,545 మంది రైతుల ఖాతాల్లో
రూ.308 కోట్లు జమ..
రైతు భరోసా పథకంలో భాగంగా శుక్రవారం వరకు జిల్లాలోని 2,71,545 మంది రైతుల ఖాతాలో రూ.308.792 కోట్లు జమ అయ్యాయని కలెక్టర్ బదావత్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్ కంటే ముందే నిధులు జమ చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని.. పెట్టుబడి భారం తగ్గించి ఉత్పాదకత పెంపొందించేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. విడతల వారీగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని వివరించారు.
సీజనల్ వ్యాధులపై
అవగాహన కార్యక్రమాలు
కలెక్టర్ బదావత్ సంతోష్