
మత్తు వదిలిస్తున్నారు!
●
కఠినంగా వ్యవహరిస్తాం..
మత్తు పదార్థాలు వినియోగించే, విక్రయించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. మత్తు పదార్థాలను కట్టడి చేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం.
– గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: సమాజంలో మత్తుకు బానిసై ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌కు అలవాటైన వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం.. వారు అసాంఘిక కార్యకలాపాలతో పాటు నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. మత్తు పదార్థాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మత్తు పదార్థాలు విక్రయించే, వినియోగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
వీడియో ప్రదర్శనలతో..
జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లోని పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో మత్తు బారిన పడితే కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీడియోలను ప్రదర్శిస్తూ వివరిస్తున్నారు.
ప్రత్యేక నిఘా..
జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణా జరగకుండా, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి మత్తు పదార్థాలు రాకుండా జిల్లా ఎకై ్సజ్, పోలీసుశాఖ సంయుక్తంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు యువత పట్టణాలు, మండల కేంద్రాల శివార్లను అడ్డాలుగా చేసుకొని మత్తు పదార్థాలు సేవిస్తుండటంతో వారిపై ప్రత్యేక నిఘా ఉంచి అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
నియంత్రణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు
గ్రామాలు, పట్టణాల్లో యువతకు
అవగాహన సదస్సులు
డ్రగ్స్ నివారణకు నిరంతరం తనిఖీలు
జిల్లాలో గంజాయి కేసుల నమోదు ఇలా..
2022లో 7 కేసులు నమోదు చేసిన పోలీసులు 3.208 కిలోల గంజాయి, 4 కిలోల గంజాయి విత్తనాలు స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్టు చేశారు.
2023లో మూడు కేసులు నమోదు చేసి 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని 10 మందిని అరెస్టు చేశారు.
2024లో 7 కేసులు నమోదు చేసి 309 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని 12 మందిని అరెస్టు చేశారు.
2025లో ఇప్పటి వరకు రెండు కేసుల్లో 920 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.

మత్తు వదిలిస్తున్నారు!

మత్తు వదిలిస్తున్నారు!